ఆంధ్రప్రదేశ్లోని మేజర్ పంచాయతీల్లో కాస్త సానుకూల ఫలితాలు రావడంతో మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలుగుదేశం పార్టీ ఆశ పడుతోంది. ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు శ్రమిస్తోంది. ఇందు కోసం ఆ పార్టీ జగన్కు ఓటేస్తే పన్నులు బాదేస్తారని ప్రచారం చేస్తోంది. ఇటీవల అదనపు అప్పుల కోసం పట్టణ సంస్కరణలు అమలు చేయడానికి ఏపీ సర్కార్ అంగీకరించింది. దాని ప్రకారం పట్టణాల్లో పెద్ద ఎత్తున పన్నులు పెంచాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆస్తి పన్ను విధిస్తారు. ఇలా చేస్తే పెద్ద ఎత్తున పన్నులు పెరుగుతాయి. దీనిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. దీన్ని టీడీపీ మరో రేంజ్ కు తీసుకెళ్తోంది. వైసీపీని గెలిపిస్తే ఎవరి ఇంటికి ఎంత పన్ను పడుతుందో.. వివరిస్తూ… ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.
ప్రజల్లో ఉన్న ఇంటి పన్ను భయాలను ఓట్లుగా మార్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు… ఈ ఇంటి పన్ను అంశాన్నే హైలెట్ చేయాలని పార్టీ నేతలకు సూచించారు. తాము వస్తే… తాము గెలిచే మున్సిపాల్టీల్లో ఇంటి పన్ను పెంచబోమని..పైగా సగానికి తగ్గిస్తామని హామీ ఇస్తున్నారు. ఇది గేమ్ చేంజర్ అని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. ఇప్పటికే… పట్టణాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా ఖర్చును సంక్షేమంపైనే పెడుతోంది. అభివృద్ధిపై పెట్టడం లేదు. నగరాల్లో,.. పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలకూ కూడా నగదు వెచ్చించడం లేదు. ఇది ప్రతిపక్షానికి కలిసి వస్తోంది.
గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అందుకునేవారు ఎక్కువగా ఉంటారు. పట్టణాల్లో తక్కువ. వాలంటీర్లు పార్టీల వారీగా గుర్తించి పథకాలను పంపిణీ చేస్తున్నారు. దీంతో యాభై ఇళ్లలో పది మందికి కూడా పథకాలు అందని పరిస్థితి. మిగతా నలభై మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నా.. తమ సర్కార్ వచ్చినా పథకాలు ఇవ్వడం లేదన్న అసంతృప్తి వారిలో ఉంది. ఇలాంటి వాటిని ఉపయోగించుకుని ఓట్లుగా మల్చుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి… ప్రభుత్వ వ్యతిరేకత ఉందని నిరూపించాలని టీడీపీ అనుకుటోంది.