లోక్సభ స్పీకర్ గా టీడీపీ అభ్యర్థిని నిలబెడితే తాము మద్దతు ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇప్పటికే ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నరని తమకు స్పీకర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారని జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై చంద్రబాబు ఇప్పటి వరకూ బయట ఎక్కడా మాట్లాడటం లేదు.
ఎన్డీఏతో సంప్రదింపుల విషయంలో చంద్రబాబు ఒక్క మాట కూడా బయట మాట్లాడటం లేదు. ఇస్తున్న ప్రాధాన్యం, పదవుల విషయంలో అసంతృప్తి ఉందా.. సంతృప్తి ఉందా అన్నది చెప్పడం లేదు. కానీ జాతీయ మీడియా మాత్రం టీడీపీ తరపున రాజకీయ స్ట్రాటజీలు అమలు చేసేస్తోంది. అన్ని పదవులు అడిగారు.. ఇన్ని పదవులు అడిగారని చెప్పి ప్రచారం చేస్తున్నారు వారి ప్రచారంతో ఇండియా కూటమి మైండ్ గేమ్ ఆడుతోంది.
చంద్రబాబు స్పీకర్ పదవిని అడిగారో లేదో ఎవరికీ తెలియదు.అయితే ఇండియా కూటమి ఇలాంటి ఆఫర్లు ఇస్తే మాత్రం.. మోదీ ఖచ్చితంగా స్పీకర్ పదవి ఇచ్చేందుకు అంగీకరించరు. అందు కోసం చంద్రబాబు పట్టుబట్టే అవకాశం లేదు. మహా అయితే డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెడతారు. చంద్రబాబునాయుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు ఆసక్తిగా లేరు.