తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు పార్టీ పదవి ఇచ్చి బుజ్జగించాలని అనుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి ప్రచారం ప్రారంభించారు. మొదట పైలా ప్రసాదరావుకు టికెట్ కేటాయించింది. కానీ.. సర్వేలో ఆయన వెనకబడ్డారని తెలియడంతో టిక్కెట్ మార్చారు.
బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే. అక్కడ్నుంచే పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ సీటు జనసేనకు కేటాయించారు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అనూహ్యంగా ఇప్పుడు మాడుగుల సీటు లభించింది. సత్యసాయి జిల్లా మడకశిర లోనూ అభ్యర్థిని మార్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దళిత విభాగ రాష్ట్ర అధ్యక్షుడైన ఎంఎస్ రాజును బరిలోకి నిలపాలనుకుంటున్నారు.
తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా టీడీపీ మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రచారంలో వెనుకబడటంతో పాటు.. ప్రత్యర్థితో వ్యాపార లావాదేవీలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలతోనే జయచంద్రారెడ్డికి ప్రత్యామ్నాయంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్ భార్య సరళారెడ్డి లేదా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేర్లపై కసరత్తు చేస్తున్నారు. మార్పులపై ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.