నామినేషన్ల స్వీకరణకు గడవు ప్రారంభమైనా.. తెలుగుదేశం పార్టీలో పెండింగ్‌లో ఉన్న స్థానాలపై ఇంకా కసరత్తు సాగుతూనే ఉంది. ఇంత వరకూ.. ఒక్క లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. కొత్తగా నర్సరావుపేట లోక్‌సభ స్థానానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరును పరిశీలిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబును.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అయితే గుంటూరు పశ్చిమలో ఇప్పటికే ఖరారుచేసిన మద్దాల గిరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆయనను నర్సరావుపేట అసెంబ్లీకి పంపే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆలపాటి రాజా నర్సరావుపేట లోక్‌సభకు పోటీ చేయనంటే… భాష్యం రామకృష్ణ పేరును పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టిక్కెట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న రాయపాటి సాంబశివరావును పిలిపించి స్కీనింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన పట్ల తనకు ఆసక్తి లేదని చెప్పిన ఎంపీ రాయపాటి తెగేసి చెప్పారు.
మరోవైపు.. తిరుపతి నుంచి.. పోటీ చేయడానికి… టీడీపీ తరపున పనబాక లక్ష్మికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇప్పటి వరకూ అభ్యర్థిని ఎంపిక చేయని విశాఖ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని జిల్లాలోని మెజారిటీ నేతల నుంచి అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ స్థానంలోని అభ్యర్థులంతా… ఒకే ప్రతిపాదన పెట్టారు. అభిప్రాయాన్ని హైకమాండ్ కు పంపారు. ఇక అమలాపురం, రాజమండ్రి స్థానాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. రాజమండ్రి నుంచి మురళీమోహన్ కోడలు మాగంటి రూపను.. ఒప్పించినట్లు చెప్పుకొస్తున్నారు. అమలాపురం ఎంపీ సీటును.. మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడికి ఇస్తారని అంటున్నారు. అయితే హఠాత్తుగా హర్షకుమార్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు బాలయోగి కుమారుడికి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఇంకా దాదాపుగా.. 35కిపైగా అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన తర్వాత ఒకటి, రెండు చోట్ల మార్పు, చేర్పుల గురించి చర్చ జరుగుతూండటంతో… అభ్యర్థులపై టీడీపీలో గందరగోళం ఏర్పడుతోంది. పెండింగ్ లో ఉన్న స్థానాలన్నీ.. బలమైన అభ్యర్థులు పోటీ పడుతూండటంతో… సర్ది చెప్పడం… టీడీపీకి ఇబ్బందికరం కానుంది. చివరి క్షణంలో కొన్ని అసెంబ్లీ స్థానాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.