తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను ఇప్పుడు మరింత సీరియస్గా తీసుకుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను గతంలో ఐ టీడీపీ అనే విభాగంగా మార్చారు. అయితే రెండు సోషల్ మీడియా విభాగాలు పని చేస్తున్నాయి. ఐ టీడీపీ ప్రత్యేకంగా పని చేస్తోంది. ఐ టీడీపీకి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఇంచార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చారు. మంచి విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన జీవీరెడ్డితో పాటు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కూడా కొత్తగా బాధ్యతలిచ్చారు.
టీడీపీ సోషల్ మీడియా ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసులకు గురయ్యారు. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. చింతకాయల విజయ్ కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. అయినా ఎవరూ ఎప్పుడూ తగ్గకుండా పని చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుండటం.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. సోషల్ మీడియా ను క్రమబద్దీకరించి మరింత పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు.
టీడీపీ కోసం స్వచ్చందంగా పని చేసే సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. పార్టీని వారిని గుర్తిస్తున్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు. దీంతో టీడీపీ కోసం సోషల్ మీడియాలో పని చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో వైసీపీలో సోషల్ మీడియాలో పని చేసి.. అధికారం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనం పొందని వారు.. ఇప్పుడు ట్రెండ్ మార్చి టీడీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ కోసం ఏళ్ల తరబడి పని చేసి సోషల్ మీడియా హ్యాండిల్స్ డీల్ చేసిన పలువురు ఇటీవలి కాలంలో టీడీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలు టీడీపీ సోషల్ మీడియా టీంను మరింత ఉత్సాహానికి గురి చేస్తున్నాయి.
వైసీపీలో కింది స్థాయి సోషల్ మీడియా కార్యకర్తలను ఉపయోగించుకుంటారు కానీ వారికి చిన్నపాటి సాయం చేయరన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆ పార్టీకి సోషల్ మీడియా కేవలం పెయిడ్ పొజిషన్లోనే ఉందని.. కానీ టీడీపీకి స్వచ్చమైన అభిమానం ఉందని ఆ పార్టీ నేతలంటున్నారు.