ఏపీలో రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. నెలాఖరులో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తుల అంశంలో సీట్ల సర్దుబాటు ఇంకా ఖరారు కాలేదు. దీనికి కారణం బీజేపీ వచ్చి కలిసే అవకాశం ఉండమే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. గురువారం ఆయన బీజేపీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులు ప్రకటించుకున్నాయి. సీట్ల సర్దుబాటు చర్చలు నిర్వహిస్తున్నాయి. అయితే బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
కానీ ఏ వైపు నుంచి అడుగు ముందుకు పడటం లేదు. ఇటీవల నేతలందరితో సమావేశమైన బీజేపీ హైకమాండ్ పొత్తులపై నేతల అభిప్రాయాలు లిఖితపూర్వకంగా తీసుకున్నరు. తమ అభిప్రాయాలను హైకమాండ్ కు పంపారు. సీనియర్ నేతలంతా రాత పూర్వకంగా తమ అభిప్రాయాలను హైకమాండ్ కు పంపారు. 90 శాతం మంది నేతలు పొత్తులకు అనుకూలంగా ఉన్నారు. వీటిని పరిశీలించిన హైకమాండ్ టీడీపీ, జనసేన నేతలతో టచ్ లోకి వచ్చినట్లుగా తెలు్సోతంది. టీడీపీతో పొత్తుపై బీజేపీ నేతలెవరూ మాట్లాడటం లేదు కానీ.. పురందేశ్వరి మాత్రం తాము జనసేనతో పొత్తులో ఉన్నామనే చెబుతున్నారు.
టీడీపీతో పొత్తులపై హైకమాండ్ చెబుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడమే మంచిదని బీజేపీ ముఖ్య నేతలు అనుకుంటున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత .. పొత్తుల విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.