ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకునేందుకు టీడీపీ సంప్రదించిందనే..వార్తలను..తెలుగుదేశం పార్టీ నేతలు తోసిపుచ్చారు. అలాంటి ప్రయత్నమే చేయలేదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్‌ను..తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా నియమించుకుంటోందనే ప్రచారం ఉద్ధృతంగా జరిగింది. అయితే.. ఆ పార్టీ.. తెలుగుదేశం కాదని.. అన్నాడీఎంకే అని తాజాగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఐ ప్యాక్ సంస్థకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు.. తమిళనాడు సీఎం పళని స్వామిని కలిశారు. దాంతో.. వారు.. అన్నాడీఎంకేతో పని చేసేందుకు మరోసారి దక్షిణాదికి వస్తున్నారని తేలింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం వెనుక.. ఐప్యాక్ టీం, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలున్నాయని.. దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. దాంతో.. ఐ ప్యాక్‌కు ఒక్క సారిగా డిమాండ్ పెరిగిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా.. ప్రశాంత్ కిషోర్‌ను.. వ్యూహాల కోసం నియమించుకుంది. ఆయన ఆ పని మీద ఉన్నారు. మరికొన్ని పార్టీలు కూడా ఆయన కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్కటంటే.. ఒక్క సీటుకే పరిమితం అయింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల భయం ఆ పార్టీకి పట్టుకుంది. అందుకే ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు.. పీకే ని…తెలుగుదేశం పార్టీ సంప్రదించిందనే వార్తలు..జాతీయ మీడియాలో రావడం.. ఆ పార్టీ నేతల్ని సైతం విస్మయానికి గురి చేసింది. వ్యూహాల కోసం.. ఇలా ఓ వ్యక్తి మీద నడిచే సంస్థల సేవలు తమకు అవసరం లేదని.. టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయాలు వేరే వాళ్ల సాయంతో చేయడం ఏమిటన్న చర్చ టీడీపీ నేతల్లో వచ్చింది. అలాంటి వారి వల్ల విజయాలు రావని.. గెలిస్తే.. పేరు మాత్రం వాళ్లకు వెళ్తుందని అంటున్నారు. తాము.. ఎవర్నీ సంప్రదించలేదని..సీఎం రమేష్ కూడా స్పష్టం చేశారు. జాతీయ మీడియాలో పీకేని.. టీడీపీ సంప్రదించిందనే వార్తలు రాగానే.. నారా లోకేష్‌కూడా.. ఇది ఫేక్ న్యూస్ సీజన్ అని..సోషల్ మీడియాలో తేల్చేశారు.