కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు పెరిగిపోయాయి. పై స్థాయితో పాటు కింది స్థాయిలోనూ చాలా మంది నేతలు జనసేనలో చేరిపోయారు. వీరేదో కూటమి గెలుపు కోసం పని చేసినట్లుగా.. కొన్ని నియోజకవర్గాల్లో చెలరేగిపోతున్నారు. వారి తీరుతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ ఈ పరిస్థితి ఉంది.
పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన వాళ్లు రెచ్చిపోతున్నారు. తమకు జనసేన అంటే ప్రాణమని.. జెండాల దగ్గర నుంచి రచ్చ చేస్తున్నారు. ఇది టీడీపీ ఇంచార్జ్ వర్మకు సమస్యగా మారుతోంది. వారు చేస్తున్న అల్లరిని నియంత్రించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. కానీ నియోజకవర్గాన్ని పట్టించుకుననే జనసేన పెద్దలు మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో ఇవి అంతకంతకూ పెరిగిపోతున్నాయి.. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పూర్తిగా వైసీపీ నుంచి వచ్చిన నేతలతోనే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ ఇంచార్జ్ కు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. జనసేనకు క్యాడర్ లేకపోయినా టీడీపీ నేతలు ప్రాణం పెట్టి ఆమెను గెలిపించారని ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారితో కలిసి టీడీపీ నేతల్ని వేధిస్తున్నారని వారు మండిపడుతున్నారు.
ఇక దెందులూరులో ప్రతి వైసీపీ నేత తాము జనసేన అంటూ వచ్చి.. పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రచ్చ జరిగింది. టిడిపి, జనసేన మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఇటీవల వైసిపి నుండి జనసేనలోకి చేరిన కార్యకర్తలే అని టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమిని ఓడించడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు జనసేనలో చేరి పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారనీ, ఇలాంటివి తన దగ్గర కుదరవని చింతమనేని హెచ్చరిస్తున్నారు.
వైసీపీ నుంచి వచ్చి చేరేవారితోనే కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. వారు కూటమిలో చిచ్చు పెట్టే ఉద్దేశంతోనే వచ్చి చేరుతున్నారా లేకపోతే.. మరో కారణం ఉందా అని విశ్లేషించి ఈ వివాదాలకు … టీడీపీ, జనసేన చెక్ పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.