రెండు తెలుగు రాష్ట్రాలలో మన రాజకీయ పార్టీలకు ఒక అలవాటుంది. అధికారంలో ఉన్న తెదేపా, తెరాసలు గత ప్రభుత్వాల అసమర్ధ, అవినీతి పాలనా కారణంగానే రెండు రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదని తాము అధికారంలోకి వచ్చిన తరువాతనే మళ్ళీ రాష్ట్రాలు గాడినపడి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పుకొంటాయి. అలాగే అధికార పార్టీలు ఏ పని మొదలుపెట్టినా ప్రతిపక్షాలు మరో ఆలోచన లేకుండా ముందుగా దానిని విమర్శించేసి, ఆ తరువాత ఆ పధకాలు, కార్యక్రమాలు అన్నీ కూడా తమ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడో మొదలుపెట్టినవేనని చెప్పుకొంటూ వాటి క్రెడిట్ కోసం ఆరాటపడుతుంటాయి.
నీటిపారుదల ప్రాజెక్టులపై మంచి అవగాహన, ఆసక్తి ఉన్న కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి దొరకడం ఆ రాష్ట్రం చేసుకొన్న అదృష్టమేనని చెప్పవచ్చు. ఆయన అధికారంలోకి రాగానే రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా ప్రాజెక్టు డిజైన్ లలో మార్పులు చేర్పులు చేసి, వాటి కోసం రాష్ట్ర బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసి, ఎగువ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని వాటిని శరవేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తుంటే, యధాప్రకారం కాంగ్రెస్, తెదేపాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మాజీ మంత్రి డి.కె.అరుణ నిన్న గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ “ప్రాజెక్టు అంచనాల పెంపు కోసమే వాటి డిజైన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆ అక్రమాలు బయటపడకూడదనే మంత్రి హరీష్ రావు మా పార్టీపై బురద జల్లుతున్నారు. అవన్నీ మా ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులే. వాటిలో నిర్మాణం చివరి దశలో ఉన్నవాటిని తెరాస ప్రభుత్వం ముందుగా పూర్తి చేయకుండా, కొత్త ప్రాజెక్టులని మొదలుపెడుతోంది. ప్రాజెక్టుల డిజైన్లలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశ్యం, చితశుద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేవు మంత్రి హరీష్ రావుకి లేదు కనుకనే ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి చూపించాలి,” అని సవాలు విసిరారు.
తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ ప్రాజెక్టులలో పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఆవహించిందని, అందుకే ప్రాజెక్టుల పేరు చెప్పుకొని భారీగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.
వారు ఆరోపిస్తున్నట్లుగా ప్రాజెక్టులలో అవినీతి జరుగుతోందో లేదో కనిపెట్టడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయా లేదా..పూర్తయితే వాటి వలన తెలంగాణా రాష్ట్రానికి మేలు జరుగుతుందా లేదా? అనే విషయాలు మరో రెండు మూడేళ్ళలోనే కళ్ళకి కట్టినట్లు కనిపించవచ్చు. ఒకవేళ అలా జరుగకపోతే ప్రతిపక్షాల ఆరోపణలు నిజమనుకోవలసి ఉంటుంది. పూర్తయి ఆశించిన ఫలితాలు కనబడితే ప్రతిపక్షాలు ప్రజలను తప్పు దారి పట్టించడానికి ప్రయత్నించినట్లు అర్ధమవుతుంది.