ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. కానీ, ఇప్పటికే రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. అనుకున్న సమయం కంటే ముందుగానే సార్వత్రిక ఎన్నికలు వస్తాయనే హడావుడి కనిపిస్తోంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలూ ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో గమనిస్తే.. మహా కూటమి ఏర్పాటు దిశగా ఒక్కో అడుగూ పడుతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే.. తెరాస సర్కారును గద్దె దించడం. అయితే, అది ఒక పార్టీ వల్ల సాధ్యం కాని పని అనే విషయం అన్ని పార్టీలకూ బాగా అర్థమైంది! అందుకే, ఎన్నడూ ఊహించని విధంగా పార్టీల మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఒక్కో పరిణామం, మహా కూటమి ఏర్పాటు దిశలోనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ చాలా అంశాలపై ఒంటరిగానే తెరాస సర్కారుతో పోరాటం చేస్తోంది. అయితే, కొన్ని విషయాల్లో ఇతర పార్టీల మద్దతను కూడా తీసుకుంటోంది. నేరేళ్ల బాధితుల విషయంలో ఈ మధ్య ఇతర పార్టీల సాయం తీసుకుంది. జీవో 39 విషయంలో కూడా టీడీపీతోపాటు వామపక్షాలను కూడా కాంగ్రెస్ కలుపుకుని ముందుకు సాగడం విశేషం. జీవో 39 అంశమై అన్ని పార్టీలు కలిసి రాజ్ భవన్ కు వెళ్లి, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలనే ఆలోచన చాన్నాళ్ల కిందటే తెర మీదికి వచ్చింది. కేసీఆర్ ను ఎదుర్కోవడం ఉమ్మడి లక్ష్యం అయినప్పుడు కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేయడంలో తప్పేముందంటూ రేవంత్ రెడ్డి కూడా పాజిటివ్ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో భాజపాతో కటీఫ్ చేసుకుని, కాంగ్రెస్ తో కలిస్తే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే, ఆ తరువాత ఈ పొత్తు వ్యవహారమై టీడీపీ ఎక్కడా మాట్లాడలేదు. కానీ, అంశాలవారీగా ప్రభుత్వంపై పోరాటం విషయంలో మాత్రం కాంగ్రెస్ కలిసే టీడీపీ ముందుకు సాగుతున్న సందర్భాలున్నాయి.
ఇక, భాజపా విషయానికొస్తే.. టీడీపీతో పొత్తు ఉంటుందో లేదో అనే క్లారిటీ ఇరు పార్టీలకూ లేదు. లేక పోయినాసరే, భాజపా కూడా కాంగ్రెస్ తో కలిసి ఇటీవల కొన్ని అంశాల విషయంలో తెరాసపై పోరాటం చేసిన సందర్భాలున్నాయి. ఇక, జేయేసీ విషయానికొస్తే.. ఇన్నాళ్లూ వారిదొక సొంత అజెండా అన్నట్టుగా కోదండరామ్ ఉండేవారు. ఇతర పార్టీలతో సంబంధం లేకుండా తన పోరాటం తనది అన్నట్టుగా వ్యవహరించేవారు. అయితే, ఇప్పుడు ఆ పంథాను టీ జేయేసీ కొంత మార్పు చేసుకుంది. రాజకీయ పార్టీలను కలుపుకుని వెళ్తూ పోరాటాలు సాగిస్తోంది. ఇతర పక్షాలు కూడా జేయేసీ ఏర్పాటు చేస్తున్న మీటింగులకు వెళ్తున్నాయి.
అంశాలవారిగానైనా సరే, తెలంగాణలోని విపక్షాలన్నీ ఏదో ఒక పాయింట్ దగ్గర కలిసికట్టుగా పనిచేస్తుండం విశేషం. అందరి ఉమ్మడి రాజకీయ లక్ష్యం ఒక్కటే… కేసీఆర్ ను మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి. సొంతంగా ఏ ఒక్క పార్టీ ఇంత భారీ లక్ష్యాన్ని అందుకునే పరిస్థితి లేదు. తెరాస బలాన్ని తట్టుకోవాలంటే ఈ పార్టీలన్నీ మహాకూటమి కట్టాల్సిన అవసరం నెమ్మదిగా కనిపిస్తోంది. ఎలాగూ అన్ని పార్టీల మధ్యా ఒక సయోధ్యాపూరిత వాతావరణం ఉండనే ఉంది. కాబట్టి, మరి కొద్ది రోజుల్లో మహా కూటమికి ఒక రూపు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయనే చెప్పొచ్చు. మరి, ఈ కూటమి సాకారమైతే, తెరాసకు బలమైన ప్రత్యర్థి తయారైనట్టే అవుతుంది.