గత ఎన్నికలకు ముందు ఈవీఎంల విషయంలో టీడీపీ చేసిన రాద్దాంతం ఇప్పటకీ చాలా మందికి గుర్తు ఉంది. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు టీడీపీ తన విధానాన్ని మార్చుకుంది. ఈవీఎంలకు వ్యతిరేకంగా పెద్దగా మాట్లాడటం లేదు సరి కదా.. ఈసీ కొత్తగా తెస్తానంటున్న రిమోట్ ఓటింగ్ మెషిన్లకూ అభ్యంతరం చెప్పడం లేదు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
దేశంలో ప్రజల్లో ఈవీఎంలపైనే ఇంకా పూర్తి స్థాయిలో అనుమానాలు తొలగిపోలేదు. ఓడిపోయిన పార్టీలన్నీ ఎప్పటికప్పుడు ఈవీఎంలనే నిందిస్తున్నాయి. గెలిచిన పార్టీలు మాత్రం ఈవీఎంలు అద్భుతమైనవని అంటున్నాయి. వీటిపై అనుమానాలు పెరిగిపోతున్న సమయంలో.. వాటిపై నమ్మకాన్ని పెంచే ప్రయత్నం ఈసీ చేయకుండా.. కొత్తగా రిమోట్ ఓటింగ్ మెషిన్లను తెరపైకి తెస్తోంది. ఈ ఓటింగ్ మెషిన్ ప్రకారం 72 నియోజకవర్గాల ఓట్లు ఓ ఓటింగ్ యంత్రంలో ఎక్కడి నుంచైనా వేయవచ్చు. ఇది టెక్నికల్ గా క్లిష్టంగా ఉన్నా.. ప్రోగ్రాం చేశారు. దీన్ని రాజకీయ పార్టీలకు ప్రదర్శించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి ఈ ఆర్వీఎంలను వ్యతిరేకించింది. భారత్ రాష్ట్ర సమితికి వ్యతిరేకించింది. కానీ టీడీపీ మాత్రం స్వాగతించింది. అయితే మరో విధంగా అభ్యంతరం తెలిపింది. ఇంత హడావుడిగా ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారని ప్రశ్నిస్తోంది. రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో ఇలా విధానాలను మార్చుకోవడంతో ప్రజలు కూడా.. ఈ అంశంపై ఓ స్పష్టతకు రాలేకపోతున్నారు. ఈవీఎంలపై.. అనుమానాలు పెరిగిపోతే ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం పోతుంది.
జమిలీ ఎన్నికల విషయంలోనూ రాజకీయ పార్టీలు ఇదే తీరులో అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాయి. గతంలో బీఆర్ఎస్, వైసీపీ ఓకే అంటే.. టీడీపీ మాత్రం నో అన్నది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఇప్పుడు టీడీపీ ఓకే అంటే..మిగతా రెండు పార్టీలు నో అంటున్నాయి.