శాసనసభను మాత్రం ఎందుకు రద్దు చేయకూడదు..?.. ఇది తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు.. విపక్ష పార్టీల నేతలందరూ.. జగన్మోహన్ రెడ్డికి సంధిస్తున్న ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తూంటే.. ఖచ్చితంగా ఆయన శాసనసభను కూడా రద్దు చేస్తారని.. జోస్యం కూడా చెబుతున్నారు. అక్రమాస్తుల కేసుల్లో తీర్పు వచ్చిన రోజున.. అసెంబ్లీని రద్దు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని.. టీడీపీ నేత దేవినేని ఉమ జోస్యం చెప్పారు. అప్పటి వరకూ ఎందుకు.. దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. సాయంత్రంలోగా అసెంబ్లీ రద్దు చేసి గవర్నర్‌కు తీర్మానం పంపాలని.. మా సవాల్‌ను స్వీకరించాలని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఘాటుగా డైరక్ట్ సవాల్ చేశారు.
ప్రజల అభిప్రాయం తీసుకుని… 3 కాదు, 30 రాజధానులు కట్టుకోవాలన్నారు. ఫ్యాక్షన్ స్వభావంతో జగన్ మండలిని రద్దు చేస్తున్నారని .. ఇవాళ మండలికి పట్టిన గతే రేపు అసెంబ్లీకి పడుతుందని.. మరో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తేల్చిచెప్పారు. అసెంబ్లీని కూడా రద్దు చేయడానికి జగన్ వెనుకాడరన్నారు. మరో టీడీపీ నేత వంగవటి రాధా కూడా ఇదే సవాల్ చేస్తున్నారు. తన మాట నెగ్గలేదని జగన్.. మండలిని రద్దు చేస్తున్నారని.. జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీని కూడా రద్దు చేయాలన్నారు. ఎన్నికలకు వెళితే ప్రజలు కూడా రివర్స్ ఓటు వేసి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
శాసనమండలిలో తన మాట నెగ్గలేదని.. మండలినే రద్దు చేస్తున్న సీఎం.. ఏదో ఓ రోజు.. ఇలాంటి పంతానికి పోయి… అసెంబ్లీని కూడా రద్దు చేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు రాజకీయవర్గాల నుంచి వస్తున్నాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. తన మాట చెల్లని పరిస్థితుల్ని ఏ మాత్రం సహించలేకపోతున్న… జగన్మోహన్ రెడ్డి… దేవినేని ఉమ చెప్పినట్లుగా… శిక్ష పడిన రోజో.. బెయిల్ రద్దయిన రోజో… ఇలాంటి ఎక్స్‌స్ట్రీమ్ స్పెట్ వేయవచ్చన్న అంచనాలు వస్తున్నాయి