పవన్ కల్యాణ్ – తెలుగుదేశం…. మిత్ర భేదమా, మిత్ర లాభమా..! ఏంటో.. ఈ బంధం ఎవ్వరికీ అర్థం కానట్టుగానే ఉంటోంది. టీడీపీతో ఢీ అంటే రెడీ అన్నట్టుగా కాసేపు పవన్ కనిపిస్తారు. అబ్బే, హమ్ సాత్ సాత్ హై అనేట్టు తెలుగుదేశం వైఖరి కాసేపు కనిపిస్తుంది. ఇంతకీ ఎవరి వెంట ఎవరు పడుతున్నారు..? ఎవరి ఇంట ఎవరు ఉంటున్నారు..? ఈ ప్రశ్నలకు తెలిసిన సమాధానాన్నే మరోసారి వెతుక్కోవాలంటే… విశాఖ ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం స్పందించిన తీరును గమనించాల్సిందే!
ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ విమర్శలన్నీ మొదట్నుంచీ కేంద్రం మీదే ఉంటూ వస్తున్నాయి. ఆయన ఫోకస్ అంతా కేంద్రమే అన్నట్టుగా సాగుతోంది. రాష్ట్రం బాధ్యత ఏంటనే ప్రస్థావన ఆయన మాటల్లోగానీ, ట్వీటుల్లోగానీ పెద్దగా కనిపించదు..! లాజికల్‌గా ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రమే కాబట్టి, ఆయన ఫోకస్ అక్కడే ఉండాలి అని కాసేపు సరిపెట్టుకుందాం. ఈ క్రమంలో పవన్ తమను పెద్దగా విమర్శించడం లేదు కాబట్టి… తెలుగుదేశం కూడా జనసేనపై పెద్దగా నోరెత్తడం లేదు. ఈ కోణం నుంచి చూస్తే పవన్-బాబుల బంధం నామ్ కే వాస్తే అన్నట్టుగా కనిపిస్తుంది.
విశాఖ ఉద్యమానికి పవన్‌తోపాటు ప్రతిపక్ష నేత జగన్ కూడా మద్దతు ఇచ్చారు కదా. ఆయన వైజాగ్ వచ్చారు. ఆయన్ని బలవంతంగా వెనక్కి పంపారు. ఈ క్రమంలో జగన్ ఎదుర్కొంటున్న విమర్శలేంటీ… ‘చంద్రబాబు చాలా అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేందుకు జగన్ జనాన్ని రెచ్చగొడుతున్నారు. విదేశాలకు వెళ్లి చంద్రబాబు పరిశ్రమలు తెస్తుంటే… చూసి ఓర్వలేకపోతున్నారు’ ఇలా తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. వాక్య నిర్మాణాల్లో కాస్త తేడాలు ఉండొచ్చేమోగానీ… జగన్ విషయంలో తెలుగుదేశం పార్టీ ధోరణి అయితే ఇదే! విశాఖ ఉద్యమం కూడా ‘జగన్ ప్రేరేపిత అభివృద్ధి నిరోధక చర్య’గా ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. కేవలం జగన్ వల్లనే యువత పక్కతోపట్టారని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే విశాఖ ఉద్యమానికి పవన్ ఇచ్చిన మద్దతు గురించి తెలుగుదేశం ఎందుకు మాట్లాడటం లేదు..? ఆయన చేసిన ట్వీట్లు యువతను రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టు పచ్చ కళ్లకు ఎందుకు కనిపించడం లేదు..? దేశ్ బచావో పేరుతో ఆయన విడుదల చేసిన పాటలు వారికి ఎందుకు వినిపించడం లేదు..? విశాఖ ఉద్యమానికి జగన్ స్థాయి మద్దతు ఇచ్చిన పవన్‌లో ‘అభివృద్ధి నిరోధకత’ వారి హ్రస్వదృష్టికి ఎందుకు ఆనడం లేదు..?
విశాఖలో జరిగిన ఘటన నచ్చకపోతే దానికి మద్దతుగా నిలిచినవారందరూ నచ్చకుండా ఉండాలి! అందర్నీ ఒకేగాటన విమర్శించాలి. జగన్‌ను విమర్శించేసి… పవన్‌ను పక్కనపెట్టేస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది..? అదే, ఇప్పుడు అనిపిస్తోంది. ఒకవేళ పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రం విశాఖకి వచ్చేసి ఉంటే… బాబు రక్షకుడు అనే విమర్శను తిప్పికొట్టినట్టయ్యేది. ఆ అవకాశాన్ని పవన్ వదులుకున్నారో… వదిలింపజేశారో తెలీదు. కానీ, ప్రస్తుతానికైతే ఆ బంధం అలానే కొనసాగుతోంది. వినిపిస్తున్న విమర్శలకు బలం చేకూరుతూనే ఉంది.