తెలంగాణాలో తెదేపా-భాజపాలు అనధికారికంగా కటీఫ్ చెప్పేసుకొని, ఎవరి దారి వారు చూసుకొన్నారు కనుక అక్కడ వారి బంధంపై ఎంతోకొంత స్పష్టత వచ్చింది కానీ ఏపిలో మాత్రం ఇంకా అదే అస్పష్టత నెలకొని ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రమంత్రుల ప్రకటనతో ఆ రెండు పార్టీల మద్య యుద్ధం తారాస్థాయికి చేరింది. కానీ తెదేపా తరపున రైల్వే మంత్రి సురేష్ ప్రభుని రాజ్యసభకి ఎంపిక చేయడంతో మళ్ళీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొన్నాయి. అప్పటి నుంచి రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం లేదు. అలాగని వారి మద్య స్నేహసంబంధాలు మెరుగుపడలేదు. ప్రస్తుతం వాటి మద్య మరో యుద్ధానికి సిద్దమవుతున్నందునే నిశబ్ధం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ నిశబ్దాన్ని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నిన్న భంగం కలిగిస్తూ, కేంద్రప్రభుత్వంపై మళ్ళీ విమర్శలు గుప్పించారు.
కర్నూలులో నిన్న జరిగిన జిల్లా తెదేపా సమన్వయకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా, రైల్వేజోన్ గురించి మేము ఎంతగా అడుగుతున్నప్పటికీ కేంద్రం ఏవో సాకులు చెపుతూ తప్పించుకొంటోంది. అవి అసలు అవసరమే లేదన్నట్లుగా మాట్లాడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తానని చెపుతోంది కానీ అందుకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు చేసిన రూ.5,000 కోట్లు తిరిగి ఇవ్వడం లేదు. ఇకనైనా రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం వైఖరి మారితే అందరికీ మంచిది,” అని అన్నారు.
విశేషం ఏమిటంటే ఆ సమయంలో మంత్రి అచ్చెం నాయుడు కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి తరువాత అంతటి వారు మరొకరు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. అంటే కృష్ణమూర్తి వ్యాఖ్యలకి ముఖ్యమంత్రి ఆమోదం ఉన్నట్లే భావించవలసి ఉంటుంది. రెండు పార్టీల మద్య యుద్దవిరమణ జరిగి పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పుడు కృష్ణమూర్తి ఆవిధంగా భాజపా నేతలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే పక్కనే ఉన్న అచ్చెం నాయుడు వారించలేదు. ఆయన మాటలకి నేడోరేపో రాష్ట్ర భాజపా నేతలు అంతకంటే ఘాటుగానే జవాబు చెప్పవచ్చు. తెదేపా-భాజపాల మద్య సంబంధాలు ఈవిధంగా ఉంటే చివరికి అవే నష్టపోయే ప్రమాదం ఉంది.