వచ్చే ఎన్నికలకు జనసేన సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమనే సంకేతాలు జనసేనాని పవన్ కల్యాణ్ ఇస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా జనసేన నుంచి ఓ ప్రకటన వెలువడినట్టు కథనాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలూ పోటీ చేద్దామనీ, ఎన్ని చోట్ల ఎంత బలం ఉంటే అంత మేరకు పోటీ చేద్దామనేది పవన్ సూచించినట్టు ఆ ప్రకటన సారాంశం. నిజానికి, ఈ ప్రకటనలో స్పష్టత లేదు! కాస్త గందరగోళంగానే ఉంది. అన్ని నియోజక వర్గాల్లోనూ పోటీకి పార్టీ సిద్ధమౌతోందా, లేదా కొన్నింటి కోసమే కార్యాచరణ చేసుకుంటోందా అనేది స్పష్టంగా ఆ ప్రకటనలో కనిపించలేదు. సరే.. ఆ ప్రకటనపై తెలుగుదేశంలో చర్చ జరుగుతోందని తెలుస్తూ ఉండటం విశేషం! జనసేన ప్రకటనపై వచ్చిన కథనాల నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆచితూచి స్పందించారు కూడా! ఇదే విషయమై విశాఖలో మీడియాతో మాట్లాడారు.
పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారుగానీ.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా అని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఏ పార్టీ ఏయే స్థానాల నుంచి పోటీకి దిగుతుందో… ఎన్ని చోట్ల అభ్యర్థులను నిలబెడుతుందో ఎవ్వరికీ తెలీదని గంటా చెప్పారు. ఎన్నికలకు సంబంధించి పవన్ కల్యాణ్ కార్యాచరణ ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది కదా అన్నారు. ప్రభుత్వం దృష్టికి పవన్ కల్యాణ్ కొన్ని సమస్యలను తీసుకొచ్చారనీ, వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులు, వ్యవసాయ విద్యార్థుల విషయంలో టీడీపీ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. నాలుగైదు సమస్యల విషయంలో పవన్ లేవనెత్తిన అభ్యంతరాలపై పరిష్కారం జరుగుతోందని ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం!
జనసేన పోటీకి దిగుతోంది కదా.. అని అడిగితే, ఏ పార్టీ ఎక్కడ్నుంచి పోటీ చేస్తుందో ఎవ్వరూ చెప్పలేరనే వేదాంత ధోరణిలో గంటా వ్యాఖ్యానించడం మరీ విడ్డూరంగా ఉంది! వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి దిగాలా, వద్దా అనేది పూర్తిగా జనసేనకు సంబంధించి అంశం. అది ఆ పార్టీ అధినేతకు చెందిన వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇతర పార్టీల అభిప్రాయాలూ సూచనల మేరకు జనసేనలో నిర్ణయాలు ఉండవు కదా! ఆ మాటకొస్తే ఏపార్టీలోనూ అలాంటి పరిస్థితి ఉండదు కదా. ఒకవేళ జనసేన పోటీకి దిగితే పొత్తు పెట్టుకుంటామా, పోరాడతామా అనేది మాత్రమే ఇతర పార్టీల సంబంధించి అంశం అవుతుంది. అంతేగానీ.. పవన్ కార్యాచరణ తెలియాలనీ, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా అని టీడీపీ మంత్రి స్పందించాల్సిన అవసరం ఏముంది..? గంటా మాటల్లో ధ్వనిస్తున్న మరో అంతరార్థం ఏంటంటే… పవన్ ఏది చెబితే అది చంద్రబాబు చేస్తున్నారు కదా, ఆయన చూపిన సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నారు కదా. కాబట్టి, ఉంటేగింటే పొత్తు మాతోనే ఉండాలి కదా అనే అనివార్యతను సృష్టిస్తున్నట్టుగా కూడా వినిపిస్తోంది. పవన్ తో స్నేహం చెడకూడదనే ధోరణి గంటా స్పందనలో కనిపిస్తోంది. అయినా, జనసేన వ్యవహారాలపై టీడీపీకి ఈ కలవరపాటు ఎందుకు చెప్పండీ..! ఏమో.. దీన్నే ముందు జాగ్రత్త చర్యలు అంటారేమో..!