రాజమండ్రిలో సామూహిక అత్యాచానికి గురైన బాలికకు అండగా ఉండాలని.. పార్టీ తరపున ఆమెను దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. బాగా చదివించి ఆమెకు ఓ దారి చూపించాలని.. భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం… దళిత బాలికను కొంత మంది సామూహికంగా నాలుగు రోజుల పాటు అత్యాచారం చేసి.. పోలీస్ స్టేషన్ ముందు విడిచి పెట్టారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. టీడీపీ నేతలు.. నిజనిర్ధారణ బృందంగా ఏర్పడి.. జరిగిన ఘటనపై పూర్తి సమాచారాన్ని చంద్రబాబుకు నివేదిక రూపంలో ఇచ్చారు.
ఆ బాలిక పదో తరగతి చదువుకుందని తెలియడంతో.. పార్టీ తరపున దత్తత తీసుకుని ఆమెను చదివించాలని నిర్ణయించారు. అలాగే రూ. రెండు లక్షల ఆర్థిక సాయాన్ని కూడా పార్టీ తరపున అందించాలని నేతలను ఆదేశించారు. బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందని చంద్రబాబు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఆర్థికంగా వెనుకబడిన పార్టీ కార్యకర్తల పిల్లలను చదివిస్తూ ఉంటుంది. హైదరాబాద్ గండిపేటలో స్కూల్ , కాలేజీలు కూడా ఉన్నాయి. అక్కడ ఆ బాలికను చదివించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో దళిత వర్గంపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ ఘటనల్లో పోలీసులే నిందితులుగా తేలుతున్నారు. రాజమండ్రి బాలిక విషయంలో… పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించగా.. యువకుడి శిరోముండనం ఘటనలో… పోలీసులే నిందితులయ్యారు. వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. చీరాలలో పోలీసులే మాస్క్ పెట్టుకోలేదని.. దళిత యువకుడ్ని కొట్టడంతో చనిపోయారు. అన్నీ వరుసగా దళితులపైనే దమనకాండ జరుగుతూండటంతో… అణిచి వేయడానికే ఇలా చేస్తున్నారని.. దళిత సంఘాలు.. విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.