చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున గాంధీజీ చూపిన బాటలో నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది, జైలులో చంద్రబాబు నిరాహారదీక్ష చేయనున్నారు. ఢిల్లీలో నారా లోకేష్, రాజమండ్రిలో నారా భువనేశ్వరి దీక్షలు చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ దీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గాంధేయపద్దతిలో తమ నిరసనలు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలందర్నీ ఏకతాటిపైకి తెచ్చేలా వారిని కలుపుకుంటూ చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసనలు చేపట్టడంలో టీడీపీ ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తోంది. మోత మోగిద్దాం పేరుతో ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన రావడం సామాన్య ప్రజలంతా మద్దతుగా రోడ్లపైకి రావడం టీడీపీ నేతల్ని ఆశ్చర్యపరిచింది. చంద్రబాబును ఎక్కువ రోజులు జైల్లో ఉంచడం వల్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని.. దానికి తగ్గట్లుగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని భావిస్తున్నారు.
మూడో తేదీన సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది., జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారిస్తుంది. మధ్యాహ్నం తర్వాత విచారణ కు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే నేరుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారు. మరో వైపు ప్రభుత్వం కూడా… ఆదేశాలు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని కేవియట్ దాఖలు చేసింది.