ప్రత్యేక హోదా! తెదేపా, భాజపాలు ఈ పదం పలకడానికి కూడా ఇష్టపడవు. యూపియే ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే గుదిబండని తమ మెడకి తగిలించిపోయిందని అవి ఎప్పుడూ బాధపడుతుంటాయి. అదే పదాన్ని రాష్ట్రంలో ప్రతిపక్షాలు తారకమంత్రంలాగ జపిస్తుంటాయి. అదే తమ పార్టీల మనుగడకి ప్రాణాధారమని భావిస్తుంటాయి. గత రెండేళ్లుగా ప్రత్యేక హోదాపై అధికార ప్రతిపక్షల మద్య, మిత్రపక్షాలైన తెదేపా భాజపాల మధ్య అనేక వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణలు, యుద్ధాలు జరిగాయి తప్ప ప్రత్యేక హోదా మాత్రం రాలేదు. చివరికి అది వాటికోసమే ప్రత్యేకంగా సృష్టించబడిన ఒక రాజకీయ అంశంగా మిగిలిపోయింది. పార్లమెంటు సమావేశాలు జరిగిన ప్రతీసారి ఈ ప్రత్యేక హోదా అంశం తప్పకుండా అందరూ గుర్తు చేసుకొంటుంటారు..ఏదో తీపి జ్ఞాపకంలాగ! అప్పుడు షరా మామూలుగానే మళ్ళీ రాష్ట్ర రాజకీయ పార్టీల మధ్య యుద్ధం మొదలవుతుంది. పార్లమెంటు సమావేశాలతోనే అది కూడా ముగిసిపోతుంటుంది.
నిన్నటి నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి కనుక మళ్ళీ ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. దాని కోసం చట్ట సవరణ చేయాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామాచంద్ర రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈ సమావేశాలలో ఓటింగ్ జరుగవలసి ఉంది. జరుగుతుందో లేక మిగిలిన అంశాలపై జరిగే గొడవలో అది మళ్ళీ వెనక్కి పోతుందో ఇంకా తెలియదు. ఒకవేళ ఓటింగ్ జరిగినా నెగ్గే అవకాశం లేదు కనుక దాని గురించి మోడీ ప్రభుత్వమేమీ ఆందోళన చెందడం లేదు. విశేషమేమిటంటే ఈసారి తెదేపా కూడా ప్రత్యేక హోదాపై సభలో చర్చ జరపాలని కోరుతూ రూల్ నెంబర్: 193 క్రింద నిన్న నోటీస్ ఇచ్చింది.
భాజపాతో స్నేహం, కేంద్రమంత్రుల పదవుల కోసమే తెదేపా ఆలోచిస్తోంది తప్ప ప్రత్యేక హోదా, దాని వలన కలిగే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్, లోక్ సభలో వైకాపా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నప్పుడు, దాని గురించి తను మాట్లాడకపోతే వాటి ఆరోపణలకి బలం చేకూర్చినట్లవుతుందనే ఉద్దేశ్యంతోనే బహుశః తెదేపా నోటీస్ ఇచ్చి ఉండవచ్చు తప్ప తాము అడిగినంత మాత్రాన్న కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా మంజూరు చేసేస్తుందనే ఆశతో కాదని చెప్పవచ్చు.
ఒకవేళ భవిష్యత్ లో ఎప్పుడైనా భాజపాతో కటీఫ్ చెప్పేసుకొంటే, అప్పుడు ప్రజల ముందు చెప్పుకోవడానికి కూడా ఇది పనికి వస్తుందని తెదేపా ఆలోచన కావచ్చు. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంగా తేల్చి చెప్పేసిన తరువాత దాని గురించి ఎంత మాట్లాడినా అది పట్టించుకోదు కనుకనే తెదేపా కూడా నోటీస్ ఇచ్చి ఉండవచ్చు. తెదేపా పడుతున్న ఇబ్బంది మోడీ ప్రభుత్వానికి కూడా తెలుసు కనుక తెదేపా నోటీస్ ఎందుకు ఇచ్చిందో అర్ధం చేసుకోగలదు కనుక అభ్యంతరం చెప్పదు. అంతిమంగా తేలేదేమిటంటే, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలని మభ్యపెట్టడానికే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకొంటున్నాయని!