ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆయనతో డిల్లీలో చెవిరెడ్డి జరిపిన చర్చలు దేనికని అడుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డిని రౌజ్ అవెన్యూ కోర్టు ఆవరణలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. దాదాపు గంట సేపు మాట్లాడారు. కుటుంబసభ్యులు మాత్రమే కలవడానికి పర్మిషన్ ఉంటుంది. కానీ చెవిరెడ్డి మాత్రం దర్జాగా కలిశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అసలు చెవిరెడ్డికి ఏం సంబంధం ఉందని.. బాబాయ్‌ని చంపిన గొడ్డలికి ఇంకా రక్తం మరకలు ఆరలేదని బెదిరించడానికా .. అమిత్ షా కాళ్లుపట్టుకుని అయినా కాపాడతాడని చెప్పడానికి కలిశారా అని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశఅనించారు. శరత్ చంద్రారెడ్డి ప్రాణాలకి మాఫియా వల్ల ప్రాణహాని ఉందని, ఈడీ, సీబీఐ అధికారులు వెంటనే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక విమానాలను జగన్ గతంలో కూడా బేగంపేట నుంచే ఏర్పాటు చేసుకున్నారని.. విజయవాడ నుంచి ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని ఆనం ప్రశ్నించారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితులు. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన పనులు ఆయనే చేస్తూంటారు. సీఎం క్యాంపాఫీసులో పశువులతో ఓ మందిరాన్ని కూడా ఆయన కట్టించారు. ఇలాగే వ్యక్తిగత అంశాల్లో ఆయనే ఎక్కువగా కనిపిస్తూంటారు. అయితే ఇప్పుడు.. ఈ శరత్ చంద్రారెడ్డి విషయంలోనూ ఆయన తెర ముందుకు రావడం.. ఢిల్లీలో నిబంధనలకు విరుద్ధంగా కలిసి మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.