మీడియాలో తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఈనాడుపై ఆధారపడలేమని టిడిపి దాదాపు నిర్ణయానికి వచ్చేసిందట. కేంద్రంలో బిజెపిని, హైదరాబాదులో ఆస్తుల రీత్యా తెలంగాణలో కెసిఆర్‌ను కాపుకాయాలనే తాపత్రయం ఎక్కువైన ఈనాడు తమను వెనక్కు నెడుతున్నదని టిడిపి యువనేత నిర్ధారణకు వచ్చేశారు. ఇటీవల వైసీపీ అద్యక్షుడు జగన్‌కు కూడా ఈనాడు బాగానే ప్రచారం ఇవ్వడం టిడిపికి మింగుడుపడటం లేదు. కాబట్టి ఆంధ్రజ్యోతిపైనే అధికంగా ఆధారపడుతున్నారట. వారికి ఆర్థిక సహాయం అనేక రూపాల్లో అడ్వర్టయిజ్మెంట్లు, ప్రభుత్వ అవసరాలు వంటివి అధికారికంగానే అప్పజెప్పి బలోపేతం చేస్తున్నారు. జగన్‌ను వ్యతిరేకించే విషయంలో ఆంధ్రజ్యోతి ఆర్కే ఏ మాత్రం రాజీ పడరని అందరికీ తెలుసు.టిడిపి ఇంకా గ్రహించని విషయాలపై కూడా ముందే ఎబిఎన్ఆంధ్రజ్యోతిలో సమాధానాలు వచ్చేస్తుంటాయి. అయితే కెసిఆర్ ప్రభుత్వం ఇటీవల ఆర్కేతో చాలా మంచి సంబంధాలు పాటిస్తున్నది. అండదండలిస్తున్నది. మధ్యలో వైరం మర్చిపోయి ఇద్దరూ పాత కాలంలో వలె అలారు బలారుగా వుంటున్నారు. ఈ సమస్య వున్నా జగన్ కోణంలో మాత్రం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి రాజీ పడబోదు గనక మనం వారిపైనే ఆధారపడదామని నిర్ణయించుకుట్టున్నారు టిడిపి నేతలు. పైగా ఈనాడు అన్ని ప్రభుత్వాలకూ అనుకూలంగా మారడంతో పదును తగ్గి ప్రచార పత్రికలా మారందిని ఆంధ్రజ్యోతి మాత్రం ఎలాగో వైవిధ్యం కొనసాగిస్తున్నదని కూడా వారు అంచనా వేశారట.