లెక్కలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే..! ఆంధ్రప్రదేశ్ కి చాలా ఇస్తున్నామని కేంద్రమూ, ఏమీ ఇవ్వడం లేదని రాష్ట్రమూ చెబుతూ గందరగోళం సృష్టిస్తోందనీ, అందుకే లెక్కలు తేల్చేందుకు మేధావులు, నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు పవన్ చెప్పారు. కేటాయింపుల విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు ఇవ్వాలని కోరారు. అంతేకాదు, ఈ నెల 15లోగా ఆ డాటా కావాలంటూ ఓ డెడ్ లైన్ కూడా పెట్టారు. నిజ నిర్దారణ కమిటీలో ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణతోపాటు పనిచేయబోతున్న ఇతరుల జాబితాను త్వరలో వెల్లడిస్తామన్నారు. తప్పు ఎవరిదో తేల్చడమే ఈ కమిటీ ఉద్దేశం అన్నట్టుగా చెప్పారు. అయితే, ఈ కమిటీపై అధికార పార్టీ తెలుగుదేశంలో భిన్నవాదనలు వినిపిస్తూ ఉండటం విశేషం!
ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి ఇదే విషయమై కాస్త భిన్నంగా స్పందించారు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనివారూ చేసినవారు, పనిలేనివారందరినీ తీసుకొచ్చి కమిటీలు ఏర్పాటు చేస్తే మేమేం చెప్తామంటూ ఆయన కాస్త ఘాటుగా మాట్లాడారు. అలాంటి కమిటీలకు స్పందించాల్సిన అవసరం ఏముందన్నట్టుగా డెప్యూటీ సీఎం మాట్లాడారు. అయితే, అదే సందర్భంలో కేయీ పక్కన ఉన్న టీడీపీ ఎంపీ మురళీ మోహన్ వెంటనే మరోలా స్పందించారు. కేయీ కామెంట్స్ ను అర్థం చేసుకుని.. వెంటనే కవర్ చేసేశారు..! రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు ఎన్ని రకాలుగా సహకరించినా అందరి సాయం తీసుకుంటామన్నారు. ‘జేయేసీ కావొచ్చు, ఇంకోటి కావొచ్చు, మరోటి కావొచ్చు… చేతిలో ఉన్న ఐదువేళ్లూ కలిస్తేనే బలంగా ఉంటుంది. దాని కోసం ఎవరు ముందుకొచ్చినా సహకారం తీసుకుంటాం. మీరూ మేమూ మనం అందరం కలవాలి. సాటి రాష్ట్రాలకు సమానంగా నిలబడాలన్నదే అందరి లక్ష్యం’ అని మురళీ మోహన్ చెప్పారు.
సో.. పవన్ ఏర్పాటు చేయబోతున్న కమిటీపై టీడీపీలో భిన్నవాదనలు ఉన్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ. నిజానికి, ఈ కమిటీ ప్రకటించిన దగ్గర నుంచే రకరకాల విశ్లేషణలు వినిపించడం మొదలైంది. పవన్ కోరినట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయింపులకు సంబంధించిన లెక్కలు అందజేస్తాయా అనేదే ప్రశ్న..? ఎందుకంటే, పోలవరంపై శ్వేత పత్రం కావాలని ఆ మధ్య పవన్ కోరితే… వివరాలూ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు పెడుతున్నామనీ, అంతకంటే శ్వేతపత్రం ఇంకేముందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు కూడా రాష్ట్ర సర్కారు నుంచి అలాంటి స్పందనే ఉండొచ్చు. అయితే, పవన్ తాజా చర్యపై టీడీపీలో కొంతమందికి అసహనం ఉందన్నది అర్థమౌతూనే ఉంది. కానీ, అది బయటపడనీయకుండా టీడీపీ పడుతున్న జాగ్రత్తలు కూడా ఇదిగో ఇలానే బయటపడిపోతున్నాయి..!