రెండు రోజుల పాటు డిజిటల్ మహానాడును టీడీపీ నిర్వహించింది. నేరుగా జరిగినట్లే.. కార్యక్రమాల పరంగా.. ఎలాంటి లోటులేకుండా నిర్వహించారు. నేతల ప్రసంగాలు… రాజకీయ తీర్మానాలు అన్నీ ఘనంగానే చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌ను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్మోహమాటంగానే బయట పెట్టారు. అదే అధికార పార్టీ నుంచి వస్తున్న వేధింపులు.. చీటికి మాటికి అరెస్టులు.. ఆస్తుల విధ్వంసం.. వంటి విషయాలు. వీటిని చంద్రబాబు దాచి పెట్టలేదు. నేరుగానే చెప్పి… ధైర్యం చెప్పారు. అయితే ఆ ధైర్యం మాటల్లోనే కనిపిస్తోంది. ఆ మాటలు క్యాడర్‌కు భరోసా ఇస్తాయా అన్నది అసలు విషయం.
పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని.. వారిపై ప్రైవేటు కేసులు వేయాలని.. టీడీపీ తరపున ఆ పని చేస్తామని … చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రైవేటు కేసుల పని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న వేధింపుల వ్యవహారంలో… ఒక్క సారిఅయినా ప్రైవేటు కేసు దాఖలు చేసి అధికారులకు వ్యతిరేకంగా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తీసుకు వచ్చినట్లయితే.. ఇతర అధికారులపై ఒత్తిడి పెరిగి ఉండేది. ఉదాహరణకు.. ప్రైవేటు స్థలంలో పూర్తి అనుమతులతో విశాఖ టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ నిర్మించుకుంటున్న భవనాన్ని రాత్రికి రాత్రి నేలమట్టం చేశారు. అది ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. తక్షణం కోర్టుకెళ్లి.. .అధికారుల వద్ద నుంచి నష్టపరిహారం వసూలు చేసుకునేలా న్యాయపోరాటం ప్రారంభించి ఉంటే… క్యాడర్‌కి కాస్త ధైర్యం ఉండేది.
ఒక్క పల్లా శ్రీనివాస్ వ్యవహారమే కాదు.. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య దగ్గర్నుంచి ఎంతో మంది టీడీపీ నేతలు… మానసికంగా ఆర్థికంగా విధ్వంసానికి గురవుతున్నారు. వ్యాపారాల్ని పోగొట్టుకున్నారు. వ్యాపారాలను పోగొట్టుకోలేని శిద్దా రాఘవరావు లాంటి వారు వైసీపీలో చేరిపోయారు. అలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారు. మిగిలిన వాళ్లను కాపాడుకోవాలంటే… వారికి తెలుగుదేశం పార్టీ తరపున భరోసా ఇవ్వాల్సి ఉంది. మహానాడు వేదికగా… చంద్రబాబు… ఎంత నష్టపోయారో… అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి ప్రయోజనం కల్పిస్తామని పరోక్షంగా భరోసా కల్పించే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. ఉపాధి హామీ బిల్లులు రాకపోవడంపై క్యాడర్లో నిరాశ ఉంది. అందుకే వారికి న్యాయపోరాటం ద్వారా కూడా ప్రభుత్వం లొంగకపోతే… టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు శాతం వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటికి రెండేళ్లే అయ్యాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే కొద్దీ… టీడీపీ నేతలపై మరింతగా దాడులు చేస్తూంటారు. వీటిని అడ్డుకోవాలంటే ప్రణాళికాబద్దంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మాటలకే పరిమితమైతే… క్యాడర్ గుండెనిబ్బరంతో ఉండటం కష్టం.