కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఆ నియోజక వర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ వరదరాజుల రెడ్డి… ఎంపీ సీఎం రమేష్ పై ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ అని వరదరాజులు ఎద్దేవా చేశారు. స్థానికంగా సంబంధంలేని విషయాల్లో రమేష్ జోక్యం చేసుకుంటున్నారనీ, దాని వల్ల జిల్లాలో పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఆయన అన్నారు. ఆయన్ని కంట్రోల్ చేయాలంటూ హెచ్చరించారు.
జిల్లాలోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ సీఎం రమేష్ గ్రూపులను పెంచి పోషిస్తున్నారనీ, దీని వల్ల తెలుగుదేశం పార్టీకి కష్టాలు తప్పవన్నారు. బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, కోడూరు, రాజంపేట.. రాజ్యసభ ఎంపీకి ఇన్ని చోట్ల గ్రూపులు మెంటెయిన్ చేయాల్సిన అవసరం ఏముందని వరదరాజులు ప్రశ్నించారు. జిల్లాతో నీకేంటి సంబంధం అంటూ నిలదీశారు. ఎన్నికల్లో నేరుగా గెలిచే సత్తా లేని నాయకుడనీ, బ్యాంకులను తప్పుతోవ పట్టించి అడ్డగోలుగా రుణాలు పొందారనీ ఆరోపించారు.
నిజానికి, 2014 ఎన్నికల సమయంలో, రాయలసీమ నుంచి ఎవరికి సీటు అని సీఎం రమేష్ రికమండ్ చేస్తే అదే పార్టీ నిర్ణయం అన్నట్టుగా టీడీపీలో చెల్లుబాటైంది. ఆ దశలో అధిష్టానం దగ్గర కూడా మంచి గుర్తింపే ఉండేది. అలాంటి నాయకుడిపై ఇప్పుడు స్థానిక నేతలు ఎందుకు గళమిప్పతున్నారు..? అంటే, మారిన పరిస్థితులే అని చెప్పొచ్చు! ఆ మధ్య ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నిక సందర్భంగా రగడ చోటుచేసుకున్న సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పార్టీ నిర్ణయాన్ని పక్కనపెట్టి, వైకాపా నుంచి వచ్చిన కౌన్సిలర్ ను ఛైర్మన్ గా నియమించే ప్రయత్నం చేశారు. అక్కడ్నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీఎం రమేష్ ను కాస్త దూరం పెడుతూ వచ్చారనే టాక్ ఉంది. ఆ తరువాత, మంత్రి నారా లోకేష్ కూడా ఆయన్ని పక్కనపెడుతూ మండలి ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డిని రాజకీయంగా ప్రోత్సహించడం మొదలుపెట్టారనీ అంటారు!
అనూహ్యంగా రెండోసారి కూడా టీడీపీ నుంచి రాజ్యసభ సీటును రమేష్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కానీ, సీఎం రమేష్ విషయంలో పార్టీ అధికాయకత్వం కొంత మార్పు వచ్చిందనీ, గతంలో ఉన్నంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, అందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న స్థానిక నేతలు, ఇప్పుడు తమ అసంతృప్తులను ఇలా బయటపెడుతున్నారని అనుకోవచ్చు.