వైకాపా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ న్ని తెదేపాలో చేర్చుకోవడంపై వైకాపాయే కాదు రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చేయి. తెదేపా విజయవాడ అర్బన్ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దానిపై స్పందిస్తూ “ఇతర పార్టీల నేతలు మా పార్టీలో చేరడానికి వస్తే మేము బీజేపీ నేతలకి ఆ సంగతి తెలియజేయనవసరం లేదు. అందుకు వారి అనుమతి మాకు అవసరం లేదు కూడా. జలీల్ ఖాన్ పార్టీ మారగానే ఆయన గురించి వైకాప నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు. ఆయన ఒక బలమయిన నాయకుడు. అందుకే ఆయనని మా పార్టీలో చేర్చుకొన్నాము. అందుకు ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే దానికి మేమేమి చేయలేము,” అని అన్నారు.
అయితే ఈ నియమం బీజేపీకి వర్తించదని తెదేపా భావిస్తుండటం విశేషం. రాష్ట్రంలో ఇతర పార్టీల నుండి నేతలను బీజేపీలోకి చేర్చుకోవాలంటే అందుకు తెదేపా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటుంది. బొత్స సత్యనారాయణ మొదట బీజేపీలో చేరాలనుకొన్నారు. అందుకు బీజేపీ కూడా సిద్దమయింది. కానీ చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పడంతో ఆయనకు బీజేపీలో ప్రవేశం దొరకలేదని వార్తలు వచ్చేయి. అందుకే ఆ తరువాత కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మి నారాయణని బీజేపీలో చేరే వరకు బీజేపీ నేతలు చాలా గోప్యత పాటించవలసి వచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారంలో కూడా తెదేపా వేలు పెడుతున్నట్లు వార్తలు వచ్చేయి. తమ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సోము వీర్రాజు లేదా పురందేశ్వరి అధ్యక్షుడిగా ఎన్నికయితే మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశ్యంతోనే తెదేపాకు అనుకూలంగా ఉండే బీజేపీ నేతలలో ఎవరో ఒకరిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యేలా వెంకయ్య నాయుడు ద్వారా బీజేపీ అధిష్టానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి అటువంటప్పుడు తెదేపాలో చేరే ఇతర పార్టీల నేతల గురించి రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడితే తెదేపాకు ఎందుకు అంత కోపం వస్తోందో?