జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార టీడీపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చెయ్యడం, మంత్రి నారా లోకేష్ పై అవినీతి అంటూ ఆరోపణలు చెయ్యడం, ఆంధ్రాకి అన్యాయం చేసిన భాజపాపైగానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైగానీ పవన్ స్పందించకపోవడం… ఇలా వివిధ కోణాల నుంచి పవన్ వ్యవహార శైలిని విశ్లేషించే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో పవన్ వ్యాఖ్యలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. అకస్మాత్తుగా పవన్ తీరు ఇలా ఎందుకు మారిందా అనే అంశంపై పలువురు నేతల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారట.
అయితే, ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్న డ్రామాగానే చూడాలనే అభిప్రాయం చంద్రబాబు సమక్షంలో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఈ మాట చంద్రబాబు నేరుగా అనకపోయినా, కీలక నేతలు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారట. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి అంశాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు తాము చేస్తుంటే… రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని ఎలాగైనా దెబ్బతియ్యాలన్న వ్యూహంతోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రాలో కూడా చేయాలని భాజపా ప్రయత్నిస్తోందని సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం. ముఖ్యంగా దక్షిణాదిలో బలమైన నాయకత్వం ఉన్న రాష్ట్రాలను రాజకీయంగా బలహీన పరచాలన్న దిశగా భాజపా కేంద్ర నాయకత్వం వ్యవహరిస్తోందన్న అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
పవన్ వ్యాఖ్యల్ని ఘాటుగా తిప్పి కొట్టాలన్ననే అభిప్రాయం టీడీపీ నేతలు చంద్రబాబు ముందు వ్యక్తం చేశారట. అంతేకాదు, ‘ప్రత్యేక హోదా కోసం అవసరమైతే అమరావతిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా’ అని పవన్ ప్రకటించడం వెనక కూడా భాజపా వ్యూహమే ఉందేమో అనేది కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించారట. పవన్ ను దీక్షకు దించి, ఆ తరువాత ఏపీకి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు సానుకూల ప్రకటనలు చేయడం ద్వారా రాజకీయంగా ఆంధ్రాలో లబ్ధి పొందే వ్యూహంలో భాజపా ఉందా అనే అనుమానాలు కూడా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏదేమైనా, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తించే విధంగా చేస్తున్నాయన్నది వాస్తవం.