ఒక్కోసారి అభిమానుల అత్యుత్సాహం రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ సోషల్ నెట్ వర్కింగ్ యుగంలో మంచి అయినా చెడు అయినా చాలా వైరల్ గా వ్యాపిస్తుంది. ఎవరో చెప్పాలి, ఎవరికో చెప్పాలి అనే సమస్యలే లేవు! ఎవరికి వారు సెల్ఫ్ బ్రాడ్ కాస్టింగ్ చేసుకోవడమే. ఈ సోషల్ మీడియాను వాడుకోవడం లో తెలుగుదేశం పార్టీ వారికి మించిని మేధావులు కూడా లేరు. 2014 ఎన్నికల ముందు నుంచినే తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో పటిష్టమైన సైన్యం కనిపించింది.
జగన్ పార్టీపై నెట్ లో నెగిటివ్ ప్రచారం విషయంలో ఈ సైన్యం దూసుకుపోయింది. అయితే అది ఎవరైనా సరే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూసుకపోయినంతలా, అధికారంలో ఉన్నప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెట్ సైన్యం పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. తాజాగా వీరు చేపట్టిన ఒక ప్రచారం ఏకంగా ఎదురుతన్నింది. దీంతో డిఫెన్స్ లోపడిపోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేసే ఒక ఫేస్ బుక్ పేజీలో ఒక ఫొటో ప్రచురించారు. తెలంగాణలో విద్యార్థులపై పోలీసుల దాష్టీకం.. అంటూ ఆ ఫొటోను ప్రచురించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పోస్టు పెట్టారు.
అయితే.. అది తెలంగాన రాష్ట్రానికి చెందిన వ్యవహారం కాదు. విజయవాడలో మెస్ చార్జీల గురించి ఒక స్టూడెంట్ యూనివన్ వారు ధర్నాకు దిగితే.. అమ్మాయిలపై కూడా పోలీసులు విరుచుకుపడ్డారు. స్త్రీల పై మగపోలీసులు ప్రవర్తించని కూడని రీతిలో వారు ప్రవర్తించి వారిని అరెస్టు చేశారు. ఇదంతా తెలంగాణలో జరిగిందని తెలుగుదేశం అనుకూలమైన వారు ప్రచారం చేశారు. ఊరికే ఉన్నా పోయేది! కానీ ఇలా చేయడంలో చిన్న పొరపాటు జరిగింది. ఆ కార్యక్రమం విజయవాడలో జరిగిందని మీడియాలో అప్పటికే వార్తలు రావడంతో పాటు, ఆ ఫొటోలోని పోలీస్ యూనిఫామ్ పై ‘ఏపీ పోలీస్’ లోగో స్పష్టంగా కనిపిస్తుంది! ఇంకేముంది.. ఇలా దొరికిపోయారు! ఈ పొటోన ప్రచారం లోకి తెచ్చిన తెలుగుదేశం అభిమానులపై ఎదురుదాడి మొదలైంది. ఏపీలో జరిగిన దాష్టీకాన్ని తెలంగాణ జరిగిందని మసిపూసి మారేడు కాయ చేస్తున్నారా? అంటూ అన్ని వైపులా దాడి జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంపై రాల్లేద్దామని వెళితే, అవి కాస్తా ఎదురుతిరిగినట్టున్నాయి!