ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహౌరాత్రాలూ ఒకే విషయం ఒకే విధంగా మాట్లాడుతున్న తీరు ఆ పార్టీవారికే మింగుడు పడటం లేదు. పెద్దాయన ఎందుకింత అభద్రతకూ గురవుతున్నారని వారు ఆశ్చర్యపోతున్నారు. సన్నిహితులు కొందరు సార్ ఇంత యాతన పడటం అవసరమా అని నచ్చజెప్పడానికి కూడా ప్రయత్నించారట. అయితే చంద్రబాబు మాత్రం మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో, ప్రతిపక్షాలను తిట్టిపోయడంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదనే సందేశం వినిపిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడమే గాక అది కూడా అమలు కాకపోయినా చూస్తూ వుండిపోవడం మన రాజకీయ పొరబాటని టిడిపి నేతలలో పెద్దభాగం భావిస్తున్నారు. ఈ ఆలస్యం వల్ల తమకు రాజకీయంగా నష్టం జరిగిందని వారు ఒకటికి రెండుసార్లు ముఖ్యమంత్రికి ఏదో రూపంలో చెబుతున్నారు. అది ఆయన కూడా గుర్తించినా పైకి అనడం మంచిది కాదని మాట్టాడ్డం లేదు. కాని తనదైన శైలిలో దాన్ని అధిగమించడానికి నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఢిల్లీ యాత్రలూ నిరంతర సమన్వయ సమావేశాలూ అన్నీ అందులో భాగంగానే చూడాలి. అయితే ఈ నిరసన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఢిల్లీవెళ్లిన ఎంపిలు కూడా కొంత అసహనానికి గురైనారు. ప్రతిదీ బహిరంగంగా మాట్లాడ్డం అలవాటైన జెసి దివాకరరెడ్డి వంటివారి మాటల్లో అది తొంగిచూసింది కూడా. ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగితే అప్పుడే బస్సు ఎక్కమంటారా? పెళ్లాం మొహం కూడా చూడొద్దా?అన్ని నిరసనలూ ఒకే రోజు చేయాలా ఆయన సరదాగా అన్నా వాస్తవంలో ఎంపిలలో చాలా మంది మనోభావం కూడా అలాగే వుంది.
వైసీపీని చూసి మన కార్యక్రమాలు నిర్ణయించుకోవడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వుందని ఒక నాయకుడన్నారు. జనసేన కమ్యూనిస్టు పార్టీలు వైసీపీని టిడిపి ఆందోళనలు రెంటినీ బలపరుస్తుంటే టిడిపీ మాత్రం వైసీపీని పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నది. జనసేనపైనా బిజెపి ఏజంట్ల ముద్ర వేస్తున్నది. రాజకీయ నేపథ్యం జాతీయ అవసరాల రీత్యా కమ్యూనిస్టులను మాత్రమే తన దాడి నుంచి మినహాయిస్తున్నది. ప్రత్యేక హౌదా సమితి నాయకులు చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీ, ఉద్యోగ నేతలను ముందు పెట్టుకుని తనే హౌదాపోరాట నాయకత్వ పాత్ర తీసుకోవాలని ముఖ్యమంత్రి వ్యూహం. దానివల్ల ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఎలా వున్నా చలసానికి నష్టమని ఆయన మిత్రులు కొందరంటున్నారు. ఎంత చేసినా సమరశీల పోరాటాలు నడిపే అవకాశం పాలకపక్షానికి వుండదు. సిపిఎం వంటి పార్టీలు అధికారంలో వున్నా ఆందోళనలు చేసేవి గాని టిడిపికి ఆ వరవడి లేదు. పైగాగతంలో ఇతరుల ఆందోళలను అణచివేసి, అరెస్టులు చేసి ఇప్పుడు తమే అవన్నీ మొదలుపెడితే నైతికంగానే గాక పాలనా పరంగానూ సమస్యలు తప్పవనే సందేహం పాలక పక్షంలో వుంది. ఇప్పుడు ఎంత ప్రయాసపడినా ఎన్ని పాచికలు వేసినా ప్రత్యేకహౌదాపై రాజీపడిన పాపం వదలిపెట్టదనే వాస్తవం టిడిపి అధినేతకు అర్థమైంది. లోకేశ్‌కు ఇదంతా వదిలేద్దామంటే వాగ్దాటి లేకపోవడం తరచూ తప్పులు పలకడం పెద్ద సమస్యగా మారిందట. అందువల్ల ఆయన మరింత ఎక్కువగా హైరాన పడుతున్నారట.