విశాఖలో జాతీయ నేతలను ఆహ్వానించి భారీ బహిరంగసభ నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ముప్ఫై ఒకటో తేదీన విశాఖలో టీడీపీ భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ , దేవేగౌడలతో పాటు పలువురు జాతీయ నేతలు రాబోతున్నారు. మక్కల్ మీది నెయ్యం నేత కమల్ హాసన్ కూడా వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును… కమల్ హాసన్… హీరోగా అభివర్ణిస్తూ ఉంటారు. పోలింగ్‌కి ముందు భారీ స్థాయిలో బల ప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. తమిళనాడు… పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టిన కమల్ హాసన్… కలసి పని చేసేందుకు జాతీయ నేతల వద్దకు వెళ్తున్నారు. ఆయన గతంలో.. పలుమార్లు కేజ్రీవాల్‌తో చర్చలు జరిపారు. ఇప్పుడు..కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీతోనూ సమావేశం అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో తన వాదన వినిపించే కమల్ హాసన్.. మిగిలిన అన్ని పార్టీలతో కలిసి.. జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విభజన చట్టం, ఇతర హామీల అమలు కోసం కేంద్రంపై పోరాడుతున్న టీడీపీ… ఎన్నికల షెడ్యూల్‌కి ముందు అమరావతిలో భారీ స్థాయిలో ధర్మపోరాట దీక్ష పేరిట సభ నిర్వహించాలని భావించింది. కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన స్థాయిలో.. చివరి ధర్మపోరాట దీక్ష చేసి.. విపక్షాల ఐక్యతను.. అదే వేదిక నుంచి ప్రదర్శించాలనుకున్నారు. అయితే.. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడూ లేని విధంగా.. మొదటి దశలోనే రావడంతో… ఆ ప్రయతాన్ని విరమించుకున్నారు. విశాఖలో ఎన్నికల ప్రచారసభను మాత్రం.. జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించి భారీగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఏప్రిల్ పదకొండో తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మరో నలభై మూడు రోజుల వరకు.. రాజకీయ కార్యకలాపాలేవీ పెద్దగా ఉండవు. ఈ మధ్య కాలంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో… ఏడు విడతల పోలింగ్ జరగనుంది. రెండు, మూడు దశల్లో.. దక్షిణాది పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాతే.. ఉత్తరాదిలో కీలకమైన రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. దీన్నే.. చంద్రబాబు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయస్థాయిలో.. పార్టీల మధ్య సఖ్యత మరింత పెంచి.. ఎన్నికల ప్రచారాలు, వ్యూహాల్లో తన వంతు సాయం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.