కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరసన గళం పెంచుతున్నారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ తప్పుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆంధ్రాకు చేయాల్సిన సాయంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు తమకు తీవ్ర ఆవేదన కలిగించాయన్నారు. బుధవారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి, ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఎన్నోరకాలుగా ఆలోచించిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనీ, తీవ్రమైన బాధతో ఆవేదనల మధ్య ఇలా ప్రకటించాల్సి వస్తోందన్నారు. ఇది తొలి అడుగు మాత్రమేననీ, ఎన్డీయేతో కొనసాగాలా వద్దా అనేది త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు రావొచ్చన్నారు. నిజానికి, ఆ పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తూ ఇన్నాళ్లూ పొత్తు కొనసాగించాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్రానికి నచ్చజెప్పేందు చాలా రకాలుగా ప్రయత్నించాననీ, 29 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చానన్నారు. అయినాసరే మన ప్రయోజనాలు దక్కకపోవడంతో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని చంద్రబాబు వివరించారు.
నిజానికి, ఈ నిర్ణయం తీసుకునే ముందు టీడీపీ నేతలతో చంద్రబాబు తీవ్రంగా చర్చించారు. అరుణ్ జైట్లీ వ్యాఖ్యల అనంతరం అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. నేతలంతా ఒకే ఒక్క మాట చెప్పారు. ఇంకా భాజపాతో కొనసాగాల్సిన అవసరం లేదనీ, కేంద్రం ఏకోశానా మన సమస్యల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనీ, ఇంకోపక్క ప్రజలు కూడా భాజపాతో తెగతెంపులే కోరుకుంటున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. ఆ తరువాత చాలాసేపు చర్చించి, అంతిమంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం నుంచి వైదొలగడం వల్ల కొన్ని సమస్యలైతే ఉంటాయి. ఇకపై కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా, మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా కొంత ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఏపీ పెట్టిన ఖర్చులకు సంబంధించి బిల్లుల చెల్లింపులపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. టీడీపీ మంత్రుల రాజీనామాలను అర్థం చేసుకోవాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నా… వారు అర్థం చేసుకునే పరిస్థితి దాదాపు ఉండదనే అనిపిస్తోంది. వారి దృష్టిలో టీడీపీ మంత్రుల రాజీనామా కేవలం నంబర్ గేమ్. ఎలాగూ, మంత్రివర్గం నుంచి వైదొలిగారు కాబట్టి… భాజపాపై మరింత తీవ్రంగా ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చెయ్యాలి. టీడీపీ మంత్రులు వైదొలిగినంత మాత్రాన రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సినవి ఇవ్వాలి కదా! అరుణ్ జైట్లీ చెప్పినట్టే వారికి అన్ని రాష్ట్రాలూ సమానమే కదా. ఆ సమాన స్థాయి కోసం టీడీపీ పోరాటం కొనసాగించాల్సిందే.