తెలంగాణాలో కృష్ణా నదిపై చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో మూడు రోజుల నిరాహార దీక్ష ముగిస్తూ, తరువాత గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తానని ప్రకటించేశారు. తన దీక్ష వలన ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు తమ తప్పులు సరిదిద్దుకొంటే సరేసరి లేకుంటే మళ్ళీ దీక్ష తప్పదని హెచ్చరించారు. జగన్ బెదిరింపులకి వారు భయపడరని వారి జవాబులు, విమర్శలే చెపుతున్నాయి కనుక జగన్ మళ్ళీ కడుపు మాడ్చుకోక తప్పదు. అయితే తన దీక్ష వలన ఆయన ఏమి ఫలితం ఆశిస్తున్నారో కానీ, పైకి ఆయన చెపుతున్న ప్రాజెక్టుల నిర్మాణం నిలుపుదల మాత్రం సాధ్యం కాదని ఆయనకీ తెలుసు. అయినా మళ్ళీ దీక్షలు చేస్తానని చెప్పడం సహజంగానే అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది.
ఆయన నిజంగానే తెలంగాణాలోని ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుంటే, తెరాస ప్రభుత్వం పట్ల కటువుగా వ్యవహరించాలి. కానీ ఆయన మనసాక్షి మీడియాని చూస్తే నేటికీ తెరాస ప్రభుత్వాన్ని భుజాన్న మోస్తూనే కనిపిస్తుంది. బహుశః అందుకే ఆయన తెరాసతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జివి ఆంజనేయులు ఆరోపిస్తున్నారేమో?
“జగన్ ఒకవైపు తెరాసకు లోపాయికారిగా సహకరిస్తూనే మళ్ళీ అది నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నట్లు దీక్షల పేరిట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకు మద్దతు పలకడం, తెరాసలో వైకాపాని విలీనం చేయించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అందుకే జగన్ చేస్తున్న దొంగ దీక్షలను ప్రజలు కూడా నమ్మడం లేదని అన్నారు. జగన్ కి నిజంగా ఆ ప్రాజెక్టులను ఆపాలనే పట్టుదల ఉన్నట్లయితే వెళ్లి తెలంగాణాలో దీక్షలు చేయమని” ఆంజనేయులు సూచించారు.
తెరాస, వైకాపాల మద్య ఏదో తెలియని ఒక రహస్య అవగాహన ఉన్నట్లు ఆ రెండు పార్టీల వ్యవహారం ఉంటుందనేది అందరికీ తెలుసు. కానీ జగన్ తెలంగాణా ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించేవిధంగా ఆకస్మికంగా దీక్షలు చేయడం, ఆ సందర్భంగా ఆ ప్రాజెక్టులను నిర్మిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కాక, తన బద్ధ శత్రువయిన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడినే లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తుండటం, సాక్షి మీడియాలో జగన్ దీక్ష గురించి, తెలంగాణాలో ప్రాజెక్టుల వలన రాష్ట్రానికి వచ్చే నష్టం గురించి వ్రాస్తూనే, మరోపక్క తెరాస ప్రభుత్వానికి డప్పు కొట్టడం గమనిస్తే తెదేపా ఆరోపణలు నిజమేనని అనుమానించక తప్పదు.