సరిగ్గా గమనిస్తే సుమారు గత 20ఏళ్లుగా ఎన్నికల సమయాలలోనూ, మిగిలిన రోజుల్లో సంవత్సరానికి రెండుసార్లు చొప్పున వినిపించే నినాదం, డిమాండ్… ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి! అవును… ఎన్టీఆర్ జయంతి, ఎన్టీఆర్ వర్ధంతి ఈ రెండు రోజుల్లోనూ ఆయన వారసులు, ఆయన స్థాపించిన పార్టీలోని నాయకులు మొదలైన పెద్దలంతా ఈ డిమాండ్ చేస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా చేస్తూ ఉన్నారు, తాజాగా మరోసారి ఆయన 21వ వర్ధంతి సందర్భంగా చేశారు.. వీలైతే మే 28న రాబోయే జయంతి రోజున చేస్తారు కూడా!! అవును… ఎన్టీఆర్ కు భారతరత్న ఏడాదిలో ఆ రెండు రోజులూ కొన్ని పత్రికల్లో హెడ్ లైన్, కొంతమంది పెద్దల స్టేట్ మెంట్ మాత్రమే!
నవరస నటనా సార్వభౌముడుగా వెండితెరపైనా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసుకున్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు. సినిమా రంగంలోనూ, నాటి రాజకీయాల్లోనూ ఆయనకు సాటైన వ్యక్తి లేరని అంటే అది అతిశయోక్తి కాదేమో! ఈస్థాయి మహామనీషికి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఎందుకు రావడం లేదు. గత రెండు దశాబ్ధాలుగా ఆయన అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్న ఇది! ఆయన స్థాపించిన పార్టీ అధికారంలో ఉంటుంది.. ఆయన సొంత అల్లుడు ముఖ్యమంత్రి హోదాలో, ఆయన కుమారుల్లో ఒకరు గతంలో రాజ్యసభ సబ్యుడిగా, మరొకరు ప్రస్తుతం ఎమ్మెల్యేగా, గతంలో ఆయన కుమార్తె కేంద్రమంత్రిగా… ఇలా కుటుంబ సభ్యులనబడేవారే ఎన్నో కీలక పదవుల్లో ఉంటున్న సమయంలో కూడా… పెద్దయనకు భారతరత్న ఎందుకు రావడం లేదు!
జనవరి 18న ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే మరణించిన తమిళనాడు ముఖ్యమంత్రి, “అమ్మ” జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీలో ఆమెకు బంధువులు, రక్త సంబందికులు ఎవరూ లేకపోయినా ఆమెను రాజకీయ గురువుగా, అమ్మగా భావించిన నేతలే ఇందుకు కంకణం కట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు వీలైనంత త్వరలో భారతరత్న ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అన్నగారి విషయంలో మాత్రం ఎలాంటి ప్రయత్నాలూ చేయడంలేదని, ఒకవేల చేసినట్లు అనిపిస్తున్నా అవి ఢిల్లీ వరకూ వెళ్లడం లేదని ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉండటమే కాకుండా, ఆ కూటమిలో చంద్రబాబుది కీలకపాత్ర అనేది తెలిసిన విషయమే. ఇదే క్రమంలో బాబు సన్నిహితుడు, స్నేహితుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి స్థానం కేంద్రంలో ఏమిటన్నది అందరికీ తెలిసిందే. ఈ సమయంలో మోడీపై బాబు ఒత్తిడి తేగలిగితే ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం రావడం చాలా చిన్న విషయం అనేది పలువురి అభిప్రాయం. ఎవరో చరిత్ర లేని వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసినా అది ఎబ్బెట్టుగా ఉండొచ్చు కానీ… నందమూరి తారకరామారావు వంటి వ్యక్తికి, మహోన్నత శక్తికి భారతరత్న రావడంపై ఎందుకు ఆలస్యం అవుతుంది. ఎవరైనా ఈ విషయంలో కావాలనే అడ్డుపడుతున్నారా… లేక కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలంటే ఇష్టం లేకుండా ఉంటున్నారా? అన్నగారికి భారతరత్న ఇవ్వడం ఇష్టం లేని ఒక అతీతశక్తి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అడ్డుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం మే 28న రాబోయే ఆయన జయంతి లోగా అయినా తెలియాలని ఆయన అభిమానులతో పాటు తెలుగువారంతా కోరుకుంటున్నారు! ఇకపై “ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్” పత్రికల్లో కనిపించకూడదని… “భారతరత్న ఎన్టీఆర్” అనే మాటే వినిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.