ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆకర్షించడానికి తెలుగుదేశం తంటాలు పడుతుందో.. లేకపోతే ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుతున్న సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందో కానీ.. కొన్ని విషయాలను పాటించేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ తమ సోషల్ మీడియా అకౌంట్లన్నింటికీ డీపీలు మార్చేసింది. త్రివర్ణ పతాకాన్ని ఉంచింది. పార్టీ.. అనుబంధ విభాగాలు.. చంద్రబాబు, లోకేష్ ఇలా అందరి డీపీల్లో జాతీయ జెండా మాత్రమే కనిపిస్తోంది.
అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అందరూ డీపీలు మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆగస్టు రెండో తేదీ నుంచి ఈ డీపీలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మొదట పట్టించుకోలేదు. ఇప్పుడు మార్చుకున్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవాల కమిటీ మెంబర్గా ఉండి.. ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించకపోతే విమర్శలు వస్తాయన్న కారణంగా టీడీపీ ఈ డీపీలు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
తెలుగు రాాష్ట్రాల్లో ఇలా మోదీ పిలుపు మేరకు డీపీలను ఏ ఇతర రాజకీయ పార్టీ మార్చుకోలేదు. బీజేపీతో పాటు ఆ పార్టీ నేతలు డీపీలు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ నేతలు ఎలాంటి మార్పులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసుకోలేదు. డీపీలు మార్చితే జీడీపీలు పెరుగుతాయా అని టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల తీరుపై విమర్సలు చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం ఎలాంటి విమర్శలు చేయకుండా డీపీ భక్తిని ప్రదర్శించేసుకున్నారు.