తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సారి హైదరాబాద్లోనే నిర్వహిస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా 29న టీడీపీ 41వ ఆవిర్భా వ దినోత్సవం జరుగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులు పాల్గొననున్న ఈ సభకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏపీ శాఖతో కలిపి సంయుక్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. సభను పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కంటోన్మెంట్ ఎన్నికల కోడ్ కారణంగా అక్కడ సభ నిర్వహణ సాధ్యం కాలేదు.
నిజాం కాలేజ్ మైదానం, ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నా అధికారుల నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు కాసాని జ్ఞానేశ్వర్ సమాయత్తం అయ్యారు. సభా నిర్వహణలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా 12 కమిటీలను నియమించారు. 2014 తర్వాత మొన్నటివరకు తెలంగాణపై చంద్రబాబు దృష్టి పెట్టకపోవడంతో సానుభూతిపరులు ఇతర పార్టీల వైపు మళ్లారు. ఇటీవల ఖమ్మం సభ విజయవంతం కావడంతో టీడీపీ పై అంచనాలు పెరిగాయి. గ్రేటర్లో టీడీపీకి మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్న సమయంలో… క్యాడర్, పార్టీ సానుభూతిపరులను తిరిగి పార్టీ వైపు తెచ్చుకునే దిశగా టీటీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ బహిరంగ సభతో కాస్త మైలేజ్ వస్తుందని, క్యాడర్లో జోష్ నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 29న జరగనున్న ఆవిర్భావ దినోత్సవ సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్యనేతలు కూడా హాజరుకానున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇప్పటికే చంద్రబాబు చర్యలు చేపట్టారు. ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి టీడీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని అందిస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో స్థానిక నేతలు పాదయాత్ర చేపడుతున్నారు. టీడీపీ నుంచి ఇతర పార్టీలలోకి వెళ్లిన నేతలు, క్యాడర్ తిరిగి రావాలని చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు.