సాక్షి పత్రికకు అధికారం పోయిన వెంటనే ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఏర్పడిందేమో కానీ ఇప్పుడు టీడీపీ నేతలు ప్రకటనలు ఇచ్చినా వేసుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సాక్షి పత్రికకు ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు . సాక్షి పత్రిక మొదటి పేజీ మొత్తం పసుపు రంగంలో.. ఎన్టీఆర్ , చంద్రబాబు, లోకేష్ పెద్ద సైజ్ ఫోటోలతో ప్రింట్ అయిపోయింది. ఇలాంటి రోజు చూస్తామని సాక్షి పాఠకులు కూడా ఎప్పుడూ అనుకుని ఉండరు.
గతంలో ఎప్పుడూ టీడీపీ నేతలు ప్రకటనలు ఇవ్వలేదా..లేకపోతే సాక్షి వేయలేదా అన్నది ఎవరికీ తెలియదు కానీ.. ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలు రాలేదు. నిజానికి సాక్షిలో ఇలాంటి ప్రకటనలు.. అదీ పత్రిక మొదటి పేజీలోనే చూస్తే జగన్ ఆగ్రహిస్తారు. డబ్బులిస్తే సాక్షి పత్రికలో చంద్రబాబు,లోకేష్, ఎన్టీఆర్ గురించి బాగా రాస్తారా అని మండిపడతారు. కానీ ఇప్పుడు ఎందుకో కానీ.. పత్రికలో ఫుల్ పేజీ ప్రకటన వచ్చేసింది.
ఈ ప్రకటనకు కనీసం యాభై లక్షల రూపాయలు సాక్షికి వచ్చి ఉంటాయని అంచనా. సాక్షి మార్కెటింగ్ టీం ప్రత్యేకంగా వేమిరెడ్డిని కలిసి.. ఈ మేరకు ప్రకటన ఇవ్వాలని విజ్ఞప్తి చేసిందని.. అందుకే ఆయన ఇచ్చారన్న గుసగుసలు సాక్షి కాంపౌండ్ లో వినిపిస్తున్నాయి. ఇది ఓ రకంగా డబ్బుల కోసం సాక్షి యాజమాన్యం దిగజారిపోవమేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలను దాటిందని మొదటి పేజీలో చెప్పడం అంటే.. వైసీపీ ఇజ్జత్ పోయినట్లేనని క్యాడర్ బాధపడుతున్నారు.
ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చిన ప్రకటన.. వైసీపీ అభిమానుల్ని నైతికంగా బలహీనం చేస్తుంది. జగన్, భారతిల డబ్బు పిచ్చిని మరోసారి బలంగా క్యాడర్ ముందు ఉంచుతుందన్న అసంతృప్తి క్యాడర్ లో కనిపించడం ఖాయమంటున్నారు. జగన్ , భారతి ప్రస్తుతం లండన్ లోఉన్నారు. అయితే వారికి తెలియకుండా ఇలాంటి ప్రకటనలు ప్రచురించరని ఆ సంస్థలోని ఉన్నత వర్గాలు చెబుతున్నాయి.