జగన్మోహన్ రెడ్డి ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో డిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలను కలిసి పిర్యాదులు చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. జగన్ తన పార్టీని కాపాడుకోవడానికి అటువంటి ప్రయత్నాలు చేయడం వింతేమీ కాదు కానీ కేంద్రమంత్రులు ఆయన అడిగిందే తడువు అపాయంట్ మెంట్ ఇవ్వడమే కాకుండా, తెదేపా ప్రభుత్వ అవినీతి గురించి జగన్ అందించిన “ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని ఆసక్తిగా తిరగేస్తూ, జగన్ చేస్తున్న పిర్యాదులు వింటుడటం తెదేపా నేతలు జీర్ణించుకోవడం కష్టమే. నిన్న తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, కేంద్ర మంత్రులను ఉద్దేశ్యించి, “జగన్ మోహన్ రెడ్డిని కలవాలనుకొనే ముందు కేంద్ర మంత్రులు కొంచెం ఆలోచించుకొంటే మంచిది,” అని హెచ్చరించారు.
ఇవ్వాళ్ళ తెదేపా నేతలు నేరుగా కేంద్ర మంత్రి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరుని ప్రస్తావించి మరీ విమర్శలు చేసారు. జగన్ పై 12 చార్జ్ షీట్లు ఉన్నాయి. అన్నిటిలో ఆయనే ఏ-1 ముద్దాయిగా ఉన్నారు. అటువంటి ఆర్ధిక నేరస్తుడుకి కేంద్ర మంత్రి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అపాయింట్ మెంట్ ఇవ్వడం, జగన్ చెపుతున్న మాటలని శ్రద్ధగా ఆలకించడం సరయిన పని అని మేము భావించడం లేదు. జగన్ వంటి ఒక ఆర్ధిక నేరస్తుడుకి ఎందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారో ఆయనే సమాధానం చెప్పాలి. అవినీతి నేరారోపణలు ఎదుర్కొంటున్న అటువంటి వ్యక్తితో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడటం మోడీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది,” అని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు.
రాష్ట్రంలో తెదేపా-భాజపాలు మిత్రపక్షాలుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉంటునప్పుడు, తెదేపా ప్రభుత్వంపై దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పిర్యాదులు చేయడానికి జగన్ వస్తే వారు అతనికి అపాయింట్ మెంట్ ఇవ్వడం తెదేపా నేతలకు ఆగ్రహం కలిగించడం సహజమే. ఒకవిధంగా తెదేపాకు వైకాపా పక్కలో బల్లెంలాగ ఉంచాలనే ఉద్దేశ్యంతోనే వారు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారేమో? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.