తెలంగాణలో జనసేన పార్టీ బీజేపీతోనే కలిసి నడుస్తుందని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏపీ డిప్యుటి సీఎం హోదాలో మొదటిసారి తెలంగాణలో కొండగట్టు ఆంజనేయుడ్ని దర్శించుకున్నారు. తెలంగాణాలో కూడా బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందని ప్రకటించారు. తెలంగాణాలో టీడీపీతో కలిసి పనిచేసే విషయాన్ని పవన్ ప్రస్తావించలేదుకాని బీజేపీతో కలిసి పనిచేస్తామని ప్రత్యేకంగా చెప్పటం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో బీజేపీతో పొత్తులోనే పోటీచేసింది. అయితే ఒక్కటంటే ఒక్కసీటులో కూడా జనసేన అభ్యర్ధులకు డిపాజిట్ కూడా దక్కలేదు. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో కనీసం పోటీ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. అయితే ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. బీజేపీ కలుపుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అన్న సంగతి తర్వాత కానీ పవన్ మాత్రం బీజేపీతో ఉన్నామని.. ముందుడుగు వేస్తామన్న సంకేతాలు పంపారు.
చంద్రబాబు కూడా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. టీ టీడీపీని గాడిన పెట్టాలని చూస్తున్నారు. ఏపీలో అఖండవిజయం సాధించటంతో తెలంగాణాలో దాదాపు భూస్ధాపితమైపోయిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు కల్పించాలని అనుకుంటున్నారు. యువనేతకు బాధ్యతలు ఇచ్చి పాత టీడీపీ నేతల్ని చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దిశగా కొన్ని ముందడుగులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏపీలో కూటమి పార్టీల్లాగా ఇక్కడ కలిసి పని చేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎవరికి వారు రాజీకీయం చేయబోతున్నారు. అయితే వీరిలో ఎంత సీరియస్ నెస్ ఉందన్నది ఎవరికీ అర్థం కాని విషయం.