పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పక్కా ప్లాన్‌తో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోడీని ఇరుకున పెట్టాలని… తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి రోజే.. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని నిర్ణయించారు. సమావేశాలు ప్రారంభమవడానికి ఒక రోజు ముందుగా.. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస నోటీసు ఇచ్చింది. ఎంపీ కేశినేని నాని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. తొలి రోజు…సభాకార్యక్రమాల జాబితాలో అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు. కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టాలంటే.. అవిశ్వాస తీర్మానామే అన్నింటికన్నా కీలకమైనదని..తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.
అవిశ్వాస తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ ఆషామాషీగా తీసుకోవడం లేదు. కలసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకునేందుకు సుదీర్ఘమైన కసరత్తు చేసింది. కాంగ్రెస్, బీజేపీయేత పార్టీలన్నింటినీ.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు గత మూడు రోజులుగా కలుస్తున్నారు. చంద్రబాబు రాసిన లేఖను వారికి ఇచ్చిన పార్లమెంట్లో తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేయాలని కోరుతున్నారు. బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ.. సపోర్ట్ చేస్తుంది. అవిశ్వాసం తీర్మానం చర్చకు వస్తే.. ఒక్క విభజన హామీలే కాదు.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ … వైఫల్యాలన్నింటిపైనా చర్చ జరుగుతుంది. అందుకే ఇతర పార్టీలు కూడా… సై అంటున్నాయి.
పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో.. అవిశ్వాసమే హైలెట్ అయింది. ఒక్కటంటే.. ఒక్క రోజు కూడా సభజరగలేదు. టీడీపీ, వైసీపీ దాదాపుగా ప్రతీ రోజు అవిశ్వాస తీర్మానాలిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇచ్చింది. అయినా.. చర్చ చేపట్టడానికి కేంద్రం ముందుకు రాలేదు. కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే..సభను అడ్డుకుంది. ఈ కారణంతో.. సమావేశాలు జరపకుండా వాయిదా వేసేశారు. ఇప్పుడు కావేరీ బోర్డును ఏర్పాటు చేసేశారు కాబట్టి.. అన్నాడీఏంకే కూడా సభను అడ్డుకునే అవకాశం లేదు. అవిశ్వాసంపై చర్చ ఇష్టం లేకపోతే.. రహస్య మిత్రులతో.. ఆందోళనలు చేయించి… సభను వాయిదాల పర్వంలోకి నెట్టి… బయటపడేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ ఇది ఆ పార్టీ ఇమేజ్ను దెబ్బ తీస్తుంది. అందుకే బుధవారం నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.