నంద్యాల ఎన్నికల్లో ఏ చిన్న అవకాశాన్నీ అధికార పార్టీ వదులుకునేట్టుగా లేదు. ఈ మధ్య బహిరంగ సభలో నంద్యాలకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కొన్ని హామీలు ఇచ్చారు. నంద్యాల జిల్లా కేంద్రం చేస్తామనీ, అభివృద్ధి బాధ్యత తనకు వదిలేయాలనీ… ఇలా కొన్ని వరాలు కురిపించారు. దీంతోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాల్చేయాలని అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాటిపై టీడీపీ వర్గాలు మండిపాటు.. ఇదంతా అయిపోయింది. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో జగన్ విమర్శల్ని తిప్పికొట్టడంతోపాటు.. ఆయన ఇచ్చిన హామీలపై కూడా తెలుగుదేశం పార్టీ దృష్టి సారిస్తుండటం విశేషం. నంద్యాలకు జగన్ ఇచ్చిన హామీలపై పార్టీ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వాటిలో జిల్లా కేంద్రం అనే హామీపై బాగానే చర్చ జరిగిందట!
ఈ సందర్భంలో తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు అంశమై ప్రజల స్పందించిన తీరును పరిగణనలోకి తీసుకున్నారట! అందుకే, నంద్యాల జిల్లా కేంద్రం అంశమై కూడా సానుకూలంగా ఏదో ఒక ప్రకటన చేయాలని టీడీపీ నిర్ణయించినట్టుంది. ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి ఇదే అంశం ప్రస్థావిస్తూ… జిల్లా కేంద్రంగా నంద్యాలను ఏర్పాటు చేయడంపై ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి లోతైన అధ్యయనం చేశాక ఒక నిర్ణయానికి వస్తామన్నారు. నంద్యాల జిల్లా ప్రతిపాదన ఇవాళ్ల కొత్తగా వచ్చింది కాదనీ, చాన్నాళ్ల నుంచీ వినిపిస్తున్నదే అని కృష్ణమూర్తి చెప్పారు! ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందనీ, అధ్యయనం చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు.
ప్రభుత్వం తరఫు నుంచి ఈ ప్రకటనకు కారణం జగన్ హామీల ప్రభావమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని కె.ఇ. చెప్పడం ద్వారా… జగన్ ఇచ్చిన హామీ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పొచ్చు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 25కి పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఇదే అంశాన్ని మరోసారి వైకాపా హామీల జాబితాలో చూపించే అవకాశం ఉంది. కాబట్టి, ఈలోగా దాని గురించి కూడా టీడీపీ ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే, గుంటూరు ప్లీనరీలో నవరత్న పథకాలంటూ జగన్ ప్రకటించాక.. వాటిలో ముఖ్యమైన మద్య నిషేధంపై టీడీపీ దృష్టి సారించి, బెల్టు షాపుల్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే లెక్కన జిల్లాల సంఖ్య పెంపు విషయాన్ని కూడా సీరియస్ గానే తీసుకునే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. ఏదేమైనా, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ జిల్లాల సంఖ్య పెంపు… నియోజక వర్గాల సంఖ్య పెరుగుదల అంశాలు! అంతేగానీ, పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం అనేవి ఎవరికి కావాలి చెప్పండీ..?