ఏపీలో సాక్షి టీవీని కేబుల్ ఆపరేటర్లు స్వచ్చందంగా నిలిపివేశారు. ఇప్పుడు సాక్షి పత్రికను కూడా స్వచ్చందంగా బహిష్కరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వాలంటీర్లకు ఇచ్చే న్యూస్ పేపర్ అలవెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి ఈ అలవెన్స్ ఇస్తూ జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని గతంలో ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది.
సాక్షి పత్రిక సర్క్యూలేషన్ కోసం.. ప్రజాధనంతో గత ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించింది. ప్రజలు డబ్బులు పెట్టి కొనడం మానేశారు. దీంతో వాలంటీర్లతో రెండున్నర లక్షలు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో మరో లక్షన్నర, అలాగే వార్డు సచివాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, వైసీపీ నేతలపై ఒత్తిడి తెచ్చి మరికొన్ని కాపీలు కొనిపించేవారు. ఇలా చూపించి ఈనాడు కన్నా ఎక్కువ సర్క్యులేషన్ ఉందనిపించుకోవాలనుకున్నారు. ఆ లక్ష్యం నెరవేరలేదు సరి కదా ఇప్పుడు .. ప్రభుత్వం మారడంతో అన్నీ ఆగిపోయాయి.
ప్రభుత్వం మారిన తర్వాత పత్రికల్లో ప్రకటనలు కూడా రావడం లేదు. ప్రభుత్వ పరమైన ప్రకటనలే కాదు.. వైసీపీ నేతలు కూడా ప్రకటనలు ఇచ్చే పరిస్థితి లేదు. అధికారంలో ఉంటే వారే పెద్ద ఎత్తున కప్పం కట్టేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది.