ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు.. అమరావతిపై బురద చల్లితే ఊరుకునేది లేదని చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. చంద్రబాబు కన్నెర్ర అని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ మాటల వరకూ ఓకే.. మరి చేతల సంగతేంటనేది .. అందరికీ వస్తున్న సందేహం. సీఎం చంద్రబాబు ఓ అంశంపై కన్నెర్ర చేశారంటే.. అధికారులు ఆ తప్పు చేసిన వారి సంగతి తేల్చాలి. మరో మాట వినిపించకూడదు. కానీ గత మూడు నెలల కాలంలో అలాంటివి జరిగిందే లేదు.
టీడీపీ గెలిచిన మరుక్షణం… చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పది రోజుల సమయం ఇచ్చి.. తమ కు ఫ్రీ హ్యాండ్ ఇస్తే స్కోర్లు సెటిల్ చేసుకుంటామని వేధింపులకు గురైన వారందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు దానికి అంగీకరించలేదు. ఎవర్నీ కదలనీయలేదు. అధికారం చేపట్టిన తర్వాత కూడా అంతే సంప్రదాయంగా ఉన్నారు. ఎంతగా అంటే చివరికి ఆ ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిని.. పులివెందులలో భారతి పీఏగా పేరున్న వర్రా రవిచంద్రారెడ్డి వంటి వారిని కూడా నోటీసులు ఇచ్చి వదిలి పెట్టేంత. నిజానికి వీరిద్దరికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చినా తప్పు పట్టనంత ఘోరమైన తప్పులు చేశారు వాళ్లు. వాళ్లు చంద్రబాబు కుటుంబంపై పెట్టిన పోస్టులకు కార్యకర్తలు రగిలిపోతూ ఉంటారు.
ఈ నోటీసుల వ్యవహారంతో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. మరో వైపు ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఫేకులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వంపై అమరావవతిపై చెలరేగిపోతున్నారు.. నిన్నటికి నిన్న గిరిజన మంత్రిపై ఘోరమైన నిందమోపే ప్రయత్నం చేశారు. ఇలాంటివన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నప్రయత్నాలే. అలాంటి వారందరికీ భయం పుట్టేలా.. చేస్తే తప్ప .. హెచ్చరికలు పని చేసే పరిస్థితి లేదు. వాళ్లను అదుపులోకి తీసుకుని కొట్టాల్సిన పని లేదని.. బుల్డోజర్ న్యాయాలు కూడా అక్కర్లేదని.. కానీ పోలీసులు తల్చుకుంటే వారు జీవితంలో మరోసారి సోషల్ మీడియాలో లాగిన్ అవడానికి భయపడాల్సిన పరిస్థితి తీసుకురాగలరని గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వం తీసుకునే చర్యల విషయంలో ఇప్పటికీ ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు ఎంతో సహనంతో ఉన్నారు. వారి ఈగోను అయినా శాటిస్ ఫై చేయాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.