ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను మొదటిసారి ప్రవేశపెట్టింది. గతంలో జగన్ సీఎంగా ఉండగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో ఆయనను ప్రజలు పాతాళానికి తొక్కేసి కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ కు అవకాశం రాలేదు. ఈ ఏడాది మాత్రం.. తమ అన్ని పథకాలు, హామీలు, అభివృద్ది కోసం నిధులు కేటాయిస్తూ బాహుబలి బడ్జెట్ ను ప్రకటించారు. ఈ బడ్జెట్ లో వంకలు పెట్టడానికి వైసీపీకి కూడా ఏమీ దొరకడం లేదు. కానీ సామాన్య ప్రజలకు కూడా ఒకటే సందేహం. మూడు లక్షల కోట్లకుపైగా ఆదాయాన్ని ఎలా సంపాదిస్తారు అనే.
పెరుగుతున్న ఆదాయం – అదే నమ్మకం
జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఆదాయ వనరు లన్నింటిపై క్రమంగా వేటు వేసుకుంటూ వచ్చారు. మొత్తంగా ఐదు సంవత్సరాల్లో ఆదాయం పెద్దగా పెరగలేదు. కేవలం ఒక్క జే బ్రాండ్ లిక్కర్ ని.. పేదల రక్త మాంసాలు పీల్చే ధరలకు అమ్మడం వల్ల పాతిక, ముప్పై వేల కోట్ల ఆదాయం అధికంగా వచ్చేది. అయితే ఆయన విధ్వంస పాలన వల్ల ఇతర రంగాల్లో ఆ ఆదాయం పడిపోయింది. ఫలితంగా కవర్ అయింది కానీ పెరగలేదు. ఐదు సంవత్సరాల పాటు ఉన్న ఇలాంటి పరిస్థితిని ఒక్క సారిగా మార్పు తీసుకురావడం అసాధ్యం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది. ఆదాయం క్రమంగా పెరుగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది పరుగులు పెడుతుందని నమ్ముతున్నారు.
ప్రభుత్వం పెట్టే ప్రతి ఖర్చులో 40 శాతం ప్రభుత్వానికే !
బడ్జెట్ కేటాయింపులతో పని లేకుండా ప్రభుత్వం రుణాలు, గ్రాంట్ల ద్వారా పెద్ద ఎత్తున పనులు చేపడుతోంది. అమరావతి నిర్మాణానికి ఈ ఒక్క ఏడాదిలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టనున్నారు. ఇదంతా కేంద్రం గ్రాంట్లు,రుణాల రూపంలో ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టుతో ఇతర కేంద్ర ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టబోతున్నారు. ఇదే సమయంలో ఏపీలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీని వల్ల పన్నుల ఆదాయం పెరుగుతుంది. అంటే ఏపీలో ప్రభుత్వం చేసే అభివృద్ధి పనుల్లో అయ్యే ఖర్చులో మళ్లీ నలభై శాతం వరకూ పన్నుల రూపంలో ప్రభుత్వానికే వస్తుంది. పెట్టుబడులు పెట్టినా అంతే. కొంత రాయితీలు ఇచ్చినా ఆదాయం భారీగా వస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి పుంజుకోనున్నాయి. అందుకే ఆదాయం పెరుగుదలపై ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది.
జగన్ నరికేసిన విశ్వాసాన్ని పెంచుకోవడమే ముఖ్యం
జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో జరిగిన విధ్వంసం కారణంగా ఏపీ పై అన్ని వర్గాల్లో విశ్వాసం పోయింది. దాన్ని ఇప్పుడు పెంచుకోవడమే ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యం. ఆయన మరోసారి అధికార పీఠానికి దగ్గరగా వచ్చే అవకాశం లేదని.. ఆయనపై న్యాయవ్యవస్థ సరైన విధంగా స్పందిస్తుందని నమ్మకం వచ్చిన రోజున ఏపీకి మరింత ఊపు వస్తుంది. ఏపీ వైపు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు.
చంద్రబాబు సంపద పెంచి.. పథకాలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు. కూలగొట్టిన ఇంటిని నిర్మించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. ఆయన సాధించి బడ్జెట్ ను పూర్తి స్థాయిలో అమలు చేస్తారని ప్రజలు కూడా నమ్మకంతో ఉన్నారు.