వైసీపీ హయాంలో దారి తప్పిన ఐపీఎస్లు.. వైపీఎస్లుగా ముద్ర వేయించుకున్నారు. వీరిలో అత్యంత ఘోరంగా అధికార దుర్వినియోగం చేసిన వారికి పోస్టింగులు కూడా ఇవ్వలేదు. కొంతమందికి పోస్టింగులు ఇచ్చినా అప్రాధాన్య పోస్టింగులు ఇచ్చారు. అయితే పోస్టింగులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారి కెరీర్ పై ఎఫెక్ట్ పడకుండా చంద్రబాబు ప్రభుత్వం మంచిగా చూసుకుంటోంది. దానికి సాక్ష్యంగా తాజాగా ఐదుగురు వైపీఎస్లకు ఇచ్చిన ప్రమోషన్లే.
కొత్త ఏడాది రోజున ప్రభుత్వం ఐదుగురు ఎస్పీలకు డీఐజీలుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఆ ఐదుగురు ఎస్పీల పేర్లు సత్య ఏసుబాబు, అన్బురాజన్, అట్టాడ బాబూజీ, అప్పలనాయుడు, ఫక్కీరప్ప. వైసీపీ హయాంలో వీరి పేర్లు తరచూ వినించేవి. ఎందుకంటే వారి నేరాలను వీరు తరచూ బిగపట్టేసేవాళ్లు. ఎదురుదాడి చేసేవాళ్లు. వీరిలో ముగ్గురికి ఇప్పటికీ పోస్టింగులు లేవు. అన్బురాజన్ , బాబూజీ, సత్య ఏసుబాబులకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వలేదు. మిగిలిన ఇద్దరూ ఎక్కడో మూలన ఓ పోస్టింగ్ తెచ్చుకోగలిగారు. అయితే ఇప్పుడు వారికి సీనియార్టీ ప్రకారం పదోన్నతి ఇవ్వకపోతే భవిష్యత్ లో తీవ్రంగా నష్టపోతారని భావించి అందరికీ ప్రమోషన్లు ఇచ్చేసింది.
నిజానికి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులపైనే వేధింపులకు పాల్పడిన అన్బురాజన్ వ్యవహారం చాలా సీరియస్. సత్య ఏసుబాబు, బాబూజీ, ఫక్కీరప్ప లాంటి వాళ్లు చేసిన పనులను బయటకు తీసి కేంద్రానికి పంపితే సర్వీసు ఉంటుందో ఉండదో కూడా చెప్పడం కష్టం. నిజానికి వారు చేసింది అవినీతో.. మరొకటో అయితే అనుకోవచ్చు. టార్గెట్ చేసింది టీడీపీని.. చంద్రబాబు కుటుంబాన్ని. అలాంటి వారి విషయంలోనూ చంద్రబాబు దయతో వ్యవహరిస్తున్నారు. వారి ప్రమోషన్లు ఇచ్చి జీవితానికి ఆటంకం లేకుండా చూస్తున్నారు