హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న రహస్య జీవోల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులను ఎదుర్కోవటంకోసం చంద్రబాబు కొత్త వ్యూహానికి రూపకల్పన చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన విడుదల చేసిన రహస్య జీవోలను వెలికి తీస్తున్నారు. వైెఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్, ఏపీఆన్‌లైన్.కామ్‌ను 2005లో ప్రారంభించారు. 2008 ఫిబ్రవరి 7న వైఎస్ ప్రభుత్వం తొలి రహస్య జీవోను విడుదల చేసింది. నాటినుంచి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న విభజన సమయంవరకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 4,363 జీవోలు విడుదల అయ్యాయి. వీటిలో – వైఎస్ ప్రభుత్వం, రాజశేఖరరెడ్డి చనిపోయిన 2009 సెప్టెంబర్ 2వ తేదీ వరకు 1,062 జీవోలు విడుదల చేసింది. వీటిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఆర్థిక, రెవెన్యూ, హోమ్, వ్యవసాయం, పశుగణాభివృద్ధి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు విడుదల చేశాయి. కొన్ని జీవోలను ఉమ్మడిరాష్ట్రం రాష్ట్రపతి పాలన కింద ఉన్న సమయంలోకూడా విడుదల చేశారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటివరకు – ఈ 18 నెలల పాలనాకాలంలో 734 జీవోలు విడుదల చేసింది. చంద్రబాబు ఆదేశాలననుసరించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులు కాంగ్రెస్ గత ప్రభుత్వాలు జారీచేసిన రహస్య జీవోలపై ఒక నివేదిక తయారు చేస్తున్నాయి.