నారా లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వంలో నారా లోకేష్‌దే కీలక పాత్ర కాబోతోంది. ఆయనే రెడ్ బుక్ బాధ్యత తీసుకున్నారు. వైసీపీ హయాంలో కొంత మంది అధికారులు గీత దాటి మరీ వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారు. వారినెవ్వరిని వదిలి పెట్టేది లేదని అందరి పేర్లూ రెడ్ బుక్‌లో ఉన్నాయని నారా లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇలా హెచ్చరిస్తున్నారని చెప్పి సీఐడీ అధికారులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు.
ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడినప్పుడు. కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవన్నారు. అప్పుడే చాలా మందిలో ఇక రెడ్ బుక్ ను అమలు చేయరా అనుకున్నారు. కానీ కక్ష సాధింపులు ఉుండబోవని చెప్పాను కానీ..తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయని వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చానని అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా యాభై రోజులకుపైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో కనీస సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది . అచ్చెన్నాయుడు సహా అనేక మందిపై పెట్టింది తప్పుడు కేసులేనని అసలు చార్జిషీట్లే వేయలేదని గుర్తు చేస్తున్నారు. వీటన్నింటిపై ఓ కమిషన్ వేసి… అధికారుల్ని శిక్షించే అవకాశం ఉంది.