తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్కు ఫిరాయించిన పది మంది సభ్యులు పార్టీని అందులో విలీనం చేస్తున్నట్టు లేఖ ఇవ్వడంతో ఒక ఘట్టం ముగిసినట్టయింది. పదవ షెడ్యూలులోని పార్టీ ఫిరాయింపుల చట్టానికి 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన నిబంధనలో ఇందుకు అవసరమైన లొసుగులున్నాయి. ఒక పార్టీలో మూడో వంతు మంది సభ్యులు రాజీనామా చేస్తే దాన్ని చీలికగా గుర్తించాలని అంతకు ముందు నిబంధనలుండేవి. ఇది దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో మూడింట రెండు వంతు మంది సభ్యులు విడిపోతే విలీనం చేసుకోవచ్చని సవరణ పేర్కొంది. ఆ సమయంలో మిగిలిన మూడోవంతు మంది విలీనం వద్దనుకుంటే పార్టీని కొనసాగించుకోవచ్చు. ఇక్కడ లొసుగు ఏమంటే రెండు వంతుల మంది ఒకేసారి విడిపోవాలి. కాని దశలవారీగా చేర్చుకుంటూ వారి రాజీనామాలు పేరబెట్టి ఆ సంఖ్యకు వచ్చాక విలీనం ముద్ర వేయడం. రాజకీయంగా నైతికంగా ఇది తప్పిదమే గాని చట్టం నుంచి తప్పించుకోవడానికి 91వ సవరణ సహాయపడుతుంది. తెలంగాణ శాసనసభలో ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని తెలుగుదేశం నేతలు అంటున్నారు.గతంలో గోడదూకిన వారిపై ఫిర్యాదులు కేసులు వుండనే వున్నాయి. అయితే ఇంత వరకూ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు గనక కోర్టులు తలదూర్చే అవకాశం లేదు. ఫిరాయింపుల చట్టం చెప్పేదేమంటే ఆయన విచక్షణాధికారం ఉపయోగించాక అది రైటో తప్పో కోర్టులు చెప్పొచ్చు. అంతేగాని ముందే నిర్దేశించే అవకాశం వుండదు. కనక ఇప్పుడు తెలంగాణ స్పీకర్ విలీనాన్ని ఆమోదించడం తథ్యం. తర్వాత దాన్ని సవాలు చేసినా కోర్టులు ఎప్పడు విచారణకు స్వీకరించేది తెలియదు. చాలాసార్లు సభల కాలపరిమితి ముగిశాక తీర్పులు వస్తుంటాయి. కనుక ఇప్పటికి ఇంతే.