ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర మరో మూడు రోజుల్లో మూడు వేల కిలో మీటర్ల మైలురాయికి చేరనుంది. దీంతో విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం దగ్గర ఒక స్థూపం నిర్మించనున్నాను. ఈనెల 24న అక్కడ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వైకాపా ప్రకటించింది. 2003లో నాటి సమస్యలపై పోరాటం చేస్తూ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సాగించారనీ, అదే తరహాలో నేటి చంద్రబాబు నాయుడి కంటక పాలనను అంతమొందించడం కోసం జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు వైకాపా ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం.
ఈ సందర్భంగా వైకాపా నేతలు మరో విషయం కూడా చెప్తున్నారండోయ్! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ జగన్ పాదయాత్రే డిసైడ్ చేస్తోందట! జగన్ పాదయాత్ర వల్లనే ప్రత్యేక హోదాకి అనుకూలంగా టీడీపీ యూటర్న్ తీసుకుందనీ, అంగవాడీ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెరిగాయన్నారు రఘురాం. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగడానికి కారణం కూడా జగన్ పాదయాత్రేనట! ఫీజు రీఎంబర్స్ మెంట్ మీద కమిటీ వేయడానికీ, బీసీలకు ఆదరణ పథకం, మెస్ ఛార్జీలు పెంచడానికీ… ఇలా చాలా అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి కారణం జగన్ పాదయాత్రే అంటున్నారు! పాదయాత్రలో జగన్ డిమాండ్లు చేస్తున్నట్టుగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయట. ఇంకా నయం… జగన్ నడుస్తున్నారు కాబట్టే, ప్రభుత్వం నడుస్తోందని అన్లేదు, సంతోషం..!
వాస్తవం మాట్లాడుకుంటే… నాటి రాజశేఖర్ రెడ్డి యాత్రకీ, నేటి జగన్ యాత్రకీ పోలిక ఎక్కడుంది..? బ్రేకులు తీసుకుంటూ, విశ్రాంతి కోసం సెలవులు తీసుకుంటూ, వారానికోసారి హైదరాబాద్ కి వచ్చి వెళ్తూ, పండుగలూ పబ్బాలూ అంటూ విరామాలు… ఇలా సాగలేదు కదా నాటి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర..? ఇక, పాదయాత్ర ప్రభావాన్ని ప్రభుత్వ నిర్ణయాల్లో వెతుక్కునే ప్రయత్నం చేయడం మరీ విడ్డూరం. కేంద్రం నుంచి సాయం వస్తుందని నాలుగేళ్లపాటు ఎదురుచూసి, చివరి బడ్జెట్ లో కూడా న్యాయం జరగకపోవడంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం మొదలుపెట్టింది. హోదాకి బదులుగా ప్యాకేజీ ఇస్తామని, అదీ ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు హోదాను కొనసాగించేట్టు కేంద్రం తీరుంది! అలాంటప్పుడు, మనకి మాత్రం ఎందుకు హోదా ఇవ్వరు అంటూ కేంద్రంపై టీడీపీ పోరాటం మొదలుపెట్టింది. దీన్లో జగన్ యాత్ర ప్రస్థావన ఎక్కడుంది..?
తమ వైఫల్యాలను కనిపించకుండా ఉండేందుకు ప్రభుత్వ నిర్ణయాల్లో జగన్ విజయాలను వెతుక్కుంటే ఎలా..? హోదా కోసం వైకాపా చేసిన రాజీనామాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ప్రజా సమస్యలపై పోరాడే చట్టబద్ధమైన వేదిక అసెంబ్లీకి వైకాపా వెళ్లదు. ఇక, ప్రతీరోజూ ముఖ్యమంత్రి మీద చేస్తున్న కోట్ల అవినీతి ఆరోపణలపై ఒక్కటంటే ఒక్క ఆధారం చూపలేకపోతున్నారు. ప్రతిపక్ష పార్టీగా విజయాలు వెతుక్కోవాల్సిన అంశాలు ఇవి..! అంతేగానీ, ప్రభుత్వం రోజువారీ తీసుకునే నిర్ణయాల్లో, అధికార పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో తమ విజయాలను వెతక్కుంటే ఏం లాభం..?