ఏపీలో టీడీపీ యమ సంబరపడిపోతోంది. బాగా సంతోషపడుతోంది. దానికి ఎందుకు అంత సంతోషం? ఏం సాధించింది? అది కేవలం ప్రతిపక్షమే కదా. ప్రతిపక్ష పార్టీగా ఉండి సాధించేదేముంటుంది? సామాన్యులు ఇలా ఎంతైనా అనుకోవచ్చు. కాని తమ పార్టీ గొప్ప విజయం సాధించిందని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అదేమిటంటే…ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని చేర్పించడం. ఈమధ్య కేంద్ర ప్రభుత్వం ఇండియా మ్యాప్ విడుదల చేస్తే అందులో అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఉన్నా ఏపీ రాజధాని పేరు లేదు. ఏపీ రాజధాని అమరావతి అని ప్రచారమైంది కదా. పరిపాలన అక్కడి నుంచే సాగుతోంది కదా. కాని మ్యాప్‌లో రాజధాని పేరు కనిపించకపోయేసరికి అధికార పార్టీ వైకాపాకు కాకుండా టీడీపీకి కోపం వచ్చింది.
ఎందుకు? అమరావతి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మానస పుత్రిక అంటే బ్రైన్ ఛైల్డ్. మ్యాప్‌లో అమరావతి తీసేసేసరికి తనకు అవమానం జరిగినట్లుగా ఆయన ఫీలయ్యాడు. అమరాతి నిర్మాణం గురించి ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడంలేదు. అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో తెలియదు. రాజధాని నిర్మాణానికి తాము అంత ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా చెప్పాడు. దాని నిర్మాణానికి డబ్బు వెచ్చించే శక్తి కూడా లేదన్నాడు. ప్రభుత్వ వైఖరి మీద ఆల్రెడీ టీడీపీ మండిపడుతోంది.దీనికి తోడు మ్యాప్‌లో అమరావతి లేకపోయేసరికి కోపం పెరిగింది. లక్కీగా పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమరావతి విషయం ప్రస్తావించాడు.
వెంటనే హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జరిగిన తప్పు సవరిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా సరిచేయించి కొత్త మ్యాప్ విడుదల చేయించాడు. దీంతో టీడీపీ నేతలు ఖుషీ అయ్యారు. ఇది చంద్రబాబు ఘన విజయమని చెబుతున్నారు. లోకేష్ ట్విట్టర్లో ఎంపీ గల్లా జయదేవ్‌ను అభినందించాడు. ఇక ఈ మ్యాప్‌ను మార్చడం సాధ్యం కాదని కూడా అన్నాడు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసినవాడు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన శంకుస్థాపన చేసిన అమరావతిని విస్మరిస్తే అది ఆయనకు అవమానమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇండియా మ్యాప్‌లో అమరావతి పర్మినెంట్‌గా ఉంటుందని అంటున్నారు. అంటే రాజధాని ని మరో ప్రాంతానికి తరలించడానికి వీలులేదని జగన్‌ను హెచ్చరించారని అనుకోవాలి.
విదేశాల్లో సైతం ఏపీ రాజధాని పేరు పాపులర్ అయింది. అమరావతి అనే నగరం లేకపోయినా ఉందని అనుకునేలా చేశాడు చంద్రబాబు. ఇది ఆయన సాధించిన టెక్నిక్. ఐదేళ్లపాటు బాబు పాలన ఎలా ఉన్నా ఆయన అమరావతి నిర్మాణం గురించి చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. బాబుతో పాటు టీడీపీ అనుకూల మీడియా కూడా అమరావతి నిర్మాణంపై పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించింది. టీవీ ఛానెళ్లలో ప్రసారం చేసింది. అమరావతి ఎలా ఉంటుందో గ్రాఫిక్స్ చిత్రాల్లో చూపించింది. అమరావతి నిర్మాణంపై బాబు చేసిన విన్యాసాలు, చూపించిన ‘అరచేతిలో స్వర్గాలు’ , విదేశాల్లో ప్రచారం, వాటితో రకరకాల ఒప్పందాల గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి పేరు వినబడటంలేదు. నిర్మాణాలు ఆగిపోయాయి. ఇదో పెద్ద కుంభకోణమని, దీని అంతు తేలుస్తామని ప్రభుత్వం చెబుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ ‘ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని మనకు అవసరం లేదు. అది సాధ్యం కూడా కాదు. ఓ మంచి రాజధాని ఉంటే చాలు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక రాగానే దాని సిఫార్సుల ప్రకారం నిర్మాణం చేపడతాం’..అని చెప్పాడు. అత్యుత్తమం కాకపోయినా ఓ మోస్తరు రాజధాని నగరమైనా జగన్ పాలనలో పూర్తవుతుందేమో చూడాలి.