పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలు ఏ మాత్రం స్వేచ్చగా జరిగే అవకాశం లేకపోవడం.. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడం ఖాయమని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఎస్ఈసీ నీలం సాహ్నిని నిమిత్తమాత్రంగానే ఉంచుతారని.. అంతా ఇతరులు పనులు పూర్తి చేసి.. ఏపక్షంగా పోలింగ్.. కౌంటింగ్ నిర్వహింప చేసుకుంటారని ఇంత మాత్రం దానికే.. ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం ఏముందని టీడీపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉండి.. వీలైనంత వరకు ఫెయిర్‌గా నిర్వహించేందుకు ప్రయత్నించినా… ప్రభుత్వ అధికార బలం ముందు సరిపోలేదు.
అదే సమయంలో ఇప్పటికే.. ఏకగ్రీవాలపై.. టీడీపీ ఫిర్యాదులు చేసి ఉంది. వాటిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. నిజానికి అసలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవద్దన్న సూచనలు.. టీడీపీకి అనేక వర్గాల నుంచి వచ్చాయి. సొంత పార్టీ నేతలు కూడా.. వేధింపులు ఎదుర్కొని.. డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా ప్రయోజనం ఉండదని.. దౌర్జన్యాలతో వాళ్లే గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారన్న అభిప్రాయాలు వినిపించాయి. ఎన్నికలు బహిష్కరించాలన్న అభిప్రాయాన్ని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నేరుగానే చెప్పారు. అయితే నిమ్మగడ్డ స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తారన్న నమ్మకంతో ఇంత కాలం టీడీపీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంది.
ఇప్పుడు.. ప్రభుత్వం చెప్పినట్లుగా వినే… రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నీలం సాహ్నిని ఎస్ఈసీ పదవిలో కూర్చోబెట్టడంతో ఇక ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చింది. పరిషత్ ఎన్నికల ప్రక్రియ.. ఎక్కడ ఆగిపోతుందో.. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే నామినేషన్లు వేసిన టీడీపీ నేతలు.. ఉపసంహరించుకుంటారా లేకపోతే.. అలా వదిలేస్తారా అన్నది ఎన్నికల ప్రకటన వచ్చాక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.