ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగా..ఆయనతోపాటు 24మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఎక్కువగా కొత్తవారికే అవకాశం ఇచ్చారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కేబినెట్ ను ఏర్పాటు చేశారు.
బీసీ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మంత్రివర్గ ఏర్పాటులో ఆ సామాజిక వర్గానికి ప్రియార్టి ఇచ్చారు. జగన్ రెడ్డి తన కేబినెట్ లో ఏడుగురు బీసీలకు అవకాశం ఇచ్చారు. దాంతో బీసీలకు తామే ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించామని గొప్పగా ప్రకటించుకున్నారు. కేవలం 7 మంత్రి పదవులు ఇచ్చేయగానే సామాజిక న్యాయం అమలైందనే రేంజ్ లో ప్రచారం చేసుకున్నారు.
ఇక, టీడీపీ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ అని ట్యాగ్ ఉంది. టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ కేబినెట్ లో బీసీలకు గతంలో కన్నా ఎక్కువ ప్రాధాన్యతస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. వైసీపీ తరహాలో బీసీలకు టీడీపీ 7 మంత్రి పదవులను కట్టబెడుతుందని అంచనా వేశారు. కానీ, వైసీపీ హయాంలో ఏడుగురికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తే టీడీపీ మాత్రం ఎనిమిది మంది బీసీలకు మంత్రి పదవులను కట్టబెట్టి… బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంలో తామెప్పుడూ ఓ మెట్టు ముందే ఉంటామని నిరూపించుకుంది.