ఏపీలో ప్రభుత్వం ఎవరిది ? . పెట్రోల్, డీజిల్ రేట్లను ఎవరు పెంచుతారు ?. ఈ చిన్న లాజిక్ చిన్న పిల్లవాడికి తెలుస్తుంది. ప్రభుత్వమే రేట్లను పెంచుతుంది. కానీ ఏపీ సర్కార్ వారు ఫ్యాక్ట్ చెక్ ఏం చెబుతుతందో తెలుసా.. టీడీపీ రేట్లను పెంచిందట. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీలో అత్యదిక పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దీనికి ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. ఏమని అంటే … టీడీపీ పెంచిందట.
2015, ఫిబ్రవరికి ముందు పెట్రోలు పై 31శాతం వ్యాట్, డీజిలు పై 22.5 శాతం వ్యాట్ ఉండేదని, గత ప్రభుత్వం ఈ రేట్లను పూర్తిగా మార్చి, పెంచిందని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపారు. అప్పుడున్న రేట్లకు అదనంగా పెట్రోలుపై లీటరకు రూ.4లు చొప్పున, డీజిలు పై లీటరుకు రూ.4లు చొప్పున ధరలు పెంచింది గత ప్రభుత్వమే అని వెల్లడించారు. అయితే అప్పుడు పెట్రోల్ రేట్లు.. డీజిల్ రేట్లు ఎంత ఉన్నాయో మాత్రం చెప్పలేదు. అప్పట్లో 70 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 110 రూపాయలు అయింది. కేంద్రం రెండు సార్లు..త పదేసి రూపాయలు చొప్పున తగ్గించినా రాష్ట్రం తగ్గించలేదు.
అప్పట్లో సీఎం జగన్ రెడ్డి అసెంబ్లీలో పెట్రోల్, డీజిల్ రేట్ల చాలా ఆవేశపడిపోయారు. దేశంలో అత్యధిక రేట్లు ఉన్నాయని అసెంబ్లీలో ఆరోపించేవారు. నిజానికి అది నిజం కాదు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజం చేసి చూపించారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలోనే ఉన్నాయి. టాక్సులు పెంచడమే కాదు.. ఓ రూపాయి రోడ్ సెస్ వేశారు. కానీ రోడ్లను మాత్రం నిర్మించడం కాదు కదా కనీసం రిపేర్లు కూడా చేయించడం లేదు.
ప్రజల్ని దోపిడీ చేసేది తాము.. కానీ చెప్పే సాకులు మాత్రం టీడీపీపైన. ఇంత మాత్రం దానికి తాము పరిపాలిస్తున్నామని చెప్పడం ఎందుకని.. చేతకాదని రాజీనామా చేయవచ్చు కదా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.